రెవెన్యూ డివిజన్‌గా ఇబ్రహీంపట్నం | ibrahim patnam is now revenue devision | Sakshi
Sakshi News home page

రెవెన్యూ డివిజన్‌గా ఇబ్రహీంపట్నం

Published Sun, Jun 19 2016 12:48 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ibrahim patnam is now revenue devision

తాత్కాలిక కలెక్టరేట్‌గా టీబీ శానిటోరియం
ఉద్యోగుల విభజనపై కసరత్తు షురూ


 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  జిల్లాలో కొత్తగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. తూర్పు ప్రాంతంలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నంతో కలుపుకొని నయా జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నంను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఇబ్రహీంపట్నంను జిల్లా చేస్తే దీని పరిధిలోకి మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల, అమన్‌గల్ మండలాలను కూడా కలపాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ జిల్లా యంత్రాంగం కూడా అంగీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో నూతన జిల్లాలపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశముంది.

 అనంతగిరిలో తాత్కాలిక కలెక్టరేట్
 వికారాబాద్ తాత్కాలిక కలెక్టరేట్‌ను అనంతగిరిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది. అనంతగిరిలోని టీబీ శానిటోరియం భవన సముదాయాన్ని దీనికోసం వినియోగించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల రూ.9 కోట్లతో శానిటోరియాన్ని ఆధునికీకరించారు.
 పర్యావరణహిత కలెక్టరేట్లను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున.. అవసరమైతే పక్కా కలెక్టరేట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుపుతోంది. అయితే, ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఒకే మార్గం ఉండడం ప్రతిబంధకంగా మారింది.  
 
 ఉద్యోగుల సర్దుబాటుపై కుస్తీ
 జిల్లాల పునర్విభజన కసరత్తు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. మండల, డివిజన్‌స్థాయి ఉద్యోగుల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ, జిల్లా స్థాయిలో పనిచేసే అధికారులు/ ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ప్రస్తుతం మండల, డివిజన్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడే కొనసాగుతారు. అయితే, జిల్లా కేంద్రంలోని వివిధ విభాగాల అధిపతుల (హెచ్‌ఓడీ)ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. వీరి మార్పులు, చేర్పులపై ఎలాంటి సంకేతాలు వచ్చినా.. విధులను పక్కన పెట్టి పోస్టింగ్‌ల కోసం ప్రయత్నిస్తారని అనుమానిస్తోంది. దీంతో ప్రస్తుతానికి వీరి జోలికి వెళ్లకూడదని నిర్ణయించింది.

జిల్లాల పరిధి తక్కువగా ఉంటున్నందున దానికి అనుగుణంగా కొన్ని పోస్టుల హోదాను తగ్గించాలని భావిస్తోంది. ఉదాహరణకు పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాలకు ప్రస్తుతం జిల్లాలో ఎస్‌ఈ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడే జిల్లాలో ఎస్‌ఈ పోస్టును రద్దు చేస్తారు. కేవలం ఈఈ స్థాయి అధికారులనే కొనసాగిస్తారు. వీరి పర్యవేక్షణలోనే కార్యకలాపాలు సాగుతాయి. ఇదే విధంగా జేడీ, డీడీ, ఏడీ పోస్టులను కూడా ఎత్తివేసి.. అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులతో సరిపెట్టాలనే యోచన చేస్తోంది. కీలకమైన రెవెన్యూ విభాగంలో మాత్రం పెద్దగా మార్పులుండకపోవచ్చు. ఇద్దరు జాయింట్ కలెక్టర్ల స్థానే ఒకరే ఉండనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement