ఐడియా అదుర్స్‌ | Idea Adhurs | Sakshi
Sakshi News home page

ఐడియా అదుర్స్‌

Published Mon, Aug 8 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఐడియా అదుర్స్‌

ఐడియా అదుర్స్‌

  • కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్ల రాకపోకలపై ఆంక్షలు
  • రోడ్డెక్కితే కొరడా ఝళిపిస్తున్న అధికారులు
  • ప్రత్యామ్నయం ఆలోచించిన రైతులు
  • ప్రత్యేక ట్రాలీలపై ట్రాక్టర్ల తరలింపు
  • మోర్తాడ్‌:రోడ్లపై కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్ల రాకపోకలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై కనబడితే చాలు జరిమానాలు, కేసు నమోదులతో పాటు వాహనాన్ని సీజ్‌ చేస్తున్నారు. దీంతో కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్లను పొలాల వరకు తరలించడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు తమ ఆలోచనకు పదును పెట్టారు. రోడ్లు పాడవకుండా కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్‌ను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేజ్‌వీల్స్‌ ఉన్న ట్రాక్టర్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడానికి ప్రత్యేకంగా ట్రాలీని తయారు చేయించారు. ఈ ట్రాలీలో కేజ్‌వీల్స్‌తో కూడిన వాహనాన్ని ఉంచి, మరో ట్రాక్టర్‌ సాయంతో పొలాలకు తరలిస్తున్నారు.
    ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. వరినాట్లు వేసేందుకు కేజ్‌వీల్స్‌తో పొలాలను దమ్ము చేస్తారు. ఎడ్లతో దమ్ము చేసే విధానం ఎప్పుడో కనుమరుగైంది. రైతులు పూర్తిగా యాంత్రీకరణపైనే ఆధారపడ్డారు. కేజ్‌వీల్స్‌ ఉన్న ట్రాక్టర్‌లతో దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. అయితే కేజ్‌వీల్స్‌ ఉన్న ట్రాక్టర్లు రోడ్లపై వెళ్తుండడంతో రహదారులు త్వరగా దెబ్బ తింటున్నాయి. ఎంతో ఖర్చు చేసి తారు రొడ్లు నిర్మిస్తే కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్ల రాకపోకలతో రహదారులను పాడు చేస్తున్నారని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. రోడ్లపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్‌లను తిప్పడాన్ని పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఎవరైనా కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్‌లను తిప్పితే జరిమానాల విధింపుతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.
    కేజ్‌వీల్స్‌ను ట్రాక్టర్‌కు అమర్చిన తరువాత వాటిని తొలగించి మళ్లీ అమర్చాలంటే అంత సులభం కాదు. అలాగని రోడ్లపై తిప్పితే అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్‌లను తరలించేందుకు మోర్తాడ్‌ మున్నూరు కాపు సంఘానికి చెందిన కొందరు రైతులు ప్రత్యేకంగా ట్రాలీని తయారు చేయించారు. దీనిపై కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్‌ను ఉంచి, మరో ట్రాక్టర్‌ సాయంతో పంట పొలాలకు తరలిస్తున్నారు. ట్రాలీ తయారీకి రూ.70 వేల వరకు ఖర్చయిందని రైతులు తెలిపారు. తమ కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్లతో పాటు ఇతరుల వాహనాలు కూడా తరలించేందుకు అద్దెకు ఇస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు.
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement