సత్యసాయి సేవలు ఆదర్శం
పుట్టపర్తి టౌన్ : మానవాళికి ప్రేమతత్వాన్ని పంచుతూ లోక కల్యాణ సాధనకు పాటుడిన మహనీయుడు సత్యసాయి అని, ఆయన సేవలు ప్రపంచానికి ఆదర్శమని కేరళ రాష్ట్ర హైకోర్ట్ జడ్జి అను శివరామన్ పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన రెండో రోజు వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. కేరళీయులు ప్రాచీన కాలం నుంచి ఓనం వేడుకలను ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నారన్నారు. చెడును సంహరించడం మంచిని పెంచడమే ఓనం పర్వదిన సందేశమన్నారు. అనంతరం కేరళలోని కోజీకోడ్ జిల్లాకు చెందిన సద్గురుకులానికి చెందిన సంగీత విద్వాంసులు సనల్‌కుమార్ వర్మ,సుభాష్ చంద్రన్,జైరాజాలు కేరళ సంప్రదాయ రీతిలో సంప్రధానభజన్ కచేరి నిర్వహించారు. కచేరీలో భాగంగా గురువాయూర్ కృష్ణ, ఆదిదేవత అయిన కోల్లూరు ముఖాంభికా, గణేష్, సుబ్రహ్మణ్యంస్వామి,శభరిమల ఆయ్యప్పలను కీర్తిస్తూ భక్తి›గీతాలు అలపించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.