మాట్లాడుతున్న సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
సాక్షి, సిటీబ్యూరో/మన్సూరాబాద్: మందు తాగి వాహనాలు నడిపేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తేనున్న ఎంవీ యాక్ట్ 2016 ప్రకారం డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారన్నారు. ఈ కేసులో జైలుకెళితే కన్విక్షన్(నేరం)గా పరిగణిస్తారని తెలిపారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్, అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఎల్‌బీనగర్‌లోని గోటేటీ కల్యాణ మండపంలో డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...
డ్రంకన్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించేందుకు పగటి పూట కూడా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ఈ ఏడాది ఇప్పటివరకు 5879 మంది డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదుకావడం దారుణమన్నారు. ఇందులో 202 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఎక్సైజ్ శాఖతో కలిసి మల్కాజిగిరి, ఎల్‌బీనగర్ జోన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాలలో బ్రీత్‌ఎన్‌లైజర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాల యజమానులు 30 ఎండీ కన్నా ఎక్కువ మద్యం సేవించిన వారిని గుర్తించి వారు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం 30ఎండీ కన్నా మద్యం సేవించి వాహనం నడుపుతూ మొదటిసారి చిక్కితే 6 నెలలు జైలుశిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధిస్తున్నారని, నూతన చట్టంలో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. మైనర్లు పట్టుబడితే వారి కళాశాల, పాఠశాల యజామాన్యాలకు తెలియజేసి వారి అడ్మిషన్లు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అతిగా మద్యం సేవించి వాహనం నడిపితే వారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం పరిధిలో 500 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ...మైనర్లు మద్యం తాగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మైనర్లకు మద్యం అమ్మే బార్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నామని, భర్త పట్టుబడితే భార్య, యువకుడు పట్టుబడితే తల్లిదండ్రులను తీసుకొని కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
ఫస్ట్ టైమ్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఫ్రీ రైడ్...
మద్యం తాగడం వల్ల జరిగే అనర్ధాలపై అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ అవగాహన కల్పించాయి. మందుబాబులు మిషన్ స్మార్ట్ రైడ్ రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే తొలి రైడ్ ఉచితంగా అందజేస్తామని మిషన్‌స్మార్ట్ రైడ్ ప్రతినిధి నాగేశ్వర్‌రావు తెలిపారు. ఆ తర్వాత యాప్ ద్వారా బుక్ చేసుకుంటే తమ సంస్థతో టై అప్ అయిన ఉబెర్ క్యాబ్‌లు సర్వీసు అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ దివ్యచరణ్‌రావు, డీసీపీ తప్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్‌రావు ట్రాఫిక్ డీసీపీ రమేష్‌నాయుడు, సీఐ కాశిరెడ్డి, అమృత పౌండేషన్ ప్రతినిధి డా. దేవిక, తదితరులు పాల్గొన్నారు.