హోదా రాకపోతే రాష్ట్రం నిర్వీర్యం
– ప్యాకేజీతో అభివృద్ధి శూన్యం
- సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ
పత్తికొండ: రాష్ట్ర విభజనలో పొందుపర్చిన డిమాండ్లను అమలు చేయకపోతే రాష్ట్రం నిర్వీర్యం అవుతుందని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని తేరుబజారులో సామాజిక హక్కుల వేదిక నియోజకవర్గ కన్వీనర్ నబిరసూల్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి ఉండదన్నారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధించేవరకు ఉద్యమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో రాజ్యమేలుతున్న 14 రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సింగాపూర్ జపం చేయడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తీవ్ర కరువులతో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగు హోదా కోసం చేసిన డిమాండ్‌లను తక్షణమే అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో బీజీపీ నాయకుడు వెంకయ్య నాయుడు 10ఏళ్ల హోదా ఇస్తేమంటే.. కాదు 15ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌ను మరచి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టు కోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నోటి దురుసును అదుపు చేసుకోవాలని హెచ్చరించారు. పందులు, కోళ్ల పందేలతో ప్రజలను పోల్చడం సరైందికాదన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నాడని, డబ్బులు ఉన్న వారికే సీట్లు ఇస్తున్నాడని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలసి కట్టుగా హోదాను సాదించుకోవడానికి ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, వైఎస్‌ఆర్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, జిల్లా కార్మిక సంఘం నాయకులు భీమలింగప్ప, శేఖర్, సీపీఎం నాయకులు వీరశేఖర్, రంగారెడ్డి, సామాజిక హక్కుల వేదిక నాయకులు గురుదాసు, సోమ శేఖర్, ఆస్పరి శ్రీనివాసులు నాయుడు, శంకరయ్య, వెంకటేష్, రవి, కారు మంచి, కృష్ణయ్య, గిడ్డయ్య, సురేంద్ర, ఇబ్రహీమ్, ఇమ్రాన్ పాల్గొన్నారు,