మా సారు కనిపిస్తే...హైదరాబాద్ రమ్మని చెప్పరా!
బీజేపీ పార్టీనుంచి గెలిచి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న ఆయన కనిపిస్తే కాస్త చెప్పండని ఆ శాఖ ఉద్యోగులు సచివాలయంలో గుసగుసలాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మా శాఖకు నిధులివ్వడం లేదని, అధికారులుగా తాము ఎంత అడిగినా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లేదని, కనీసం మంత్రి వచ్చి అడిగితే ఇచ్చే పరిస్థితి ఉన్నా ఆ మంత్రి సొంత జిల్లాకే పరిమితమయ్యారని అంటున్నారు. ఇప్పటికే మా శాఖకు నిధులివ్వడం లేదన్న వార్తలు పత్రికల్లో వస్తున్నా కూడా మా మంత్రి పట్టించుకోవడం లేదని, నేరుగా చెప్పలేకపోతున్నామని కూడా అంటున్నారు.
ఏదైనా సర్వీసులు ప్రైవేటుకు అప్పజెపితే ఆ సర్వీసులకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులను ముఖ్యమంత్రికి పరిచయం చేయడానికి మినహా మరెప్పుడూ సచివాలయానికి రావడం లేదని, అతి మంచితనమో, అడగలేనితనమో అర్థం కావడం లేదని అంటున్నారు. మాటకంటే ముందే ఇన్‌స్టిట్యూషన్లలో నిద్రలు గడిపే మా మంత్రి నిధుల కోసం ఒక్కరోజు సచివాలయంలో నిద్ర చేస్తే నిధులు వాటికవే పరిగెట్టుకుంటూ వస్తాయని ఓ ఉద్యోగి నిట్టూర్చాడు. మా మంత్రి కనిపిస్తే ఎవరైనా జిల్లాను దాటి హైదరాబాద్ వరకూ వచ్చి వెళ్లాలని చెప్పాలని ఆ ఉద్యోగి ఛలోక్తి విసిరారు.