ఇగ్నో కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం
Published Wed, Aug 10 2016 12:46 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
ఎంవీపీకాలనీ : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో పలు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్టు ప్రాంతీయ చాలకులు డాక్టర్ ఎస్.రాజారావు తెలిపారు. ఉషోదయా కూడలి వద్ద ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల పరిధి విశాఖ కేంద్రంగా 2011లో ప్రారంభమైన ఇగ్నోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా ఇంటర్ అర్హత కలిగిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ అక్వాకల్చర్, డిప్లొమా ఇన్ డెయిరీ వంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అక్వాకల్చర్ కోర్సు ఆంగ్లమాధ్యమంలో ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ. 6500. కాగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందన్నారు. డిప్లొమా ఇన్ డెయిరీ కోర్సును తెలుగు మాధ్యమంలో ప్రవేశపెడుతున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. అదేవిధంగా
పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులలో చేరగోరు అభ్యర్థులకు ఆగస్టు 17 చివరి తేదీ కాగా, ఆగష్టు 31వ వరకు రూ. 300 అపరాధ రుసుముతో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఇగ్నో సహాయ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ డి.ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సీఏ అభ్యర్థులకు సీపీటీ ప్రవేశపరీక్ష ద్వారా బీకాం కోర్సు అందిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను ఉషోదయా కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం లేదా ఇగ్నో అధ్యయన కేంద్రాల్లో రూ. 200 చెల్లించి ప్రాస్పెక్టస్ పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు 0891–2511200– 300– 400 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో ఇగ్నో సహాయ రిజిస్ట్రార్ లక్ష్మిపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement