తెల్లారిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి బతుకు
తెల్లారిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి బతుకు
Published Fri, Aug 19 2016 11:11 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
హనుమాన్ జంక్షన్ రూరల్ :
ఎన్నో ఆశలతో ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థి రైలు పట్టాలపై శవమై తేలడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నర్సారావు పేట మండలం కొండ కొవ్వూరుకు చెందిన బాలోజు శివ ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఈ నేప«థ్యంలో శుక్రవారం శివ మృతదేహం నూజివీడు స్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై ప్రత్యక్షమైంది. గత నెల 16వ తేదీన శివ ట్రిపుల్ ఐటీలో చేరాడని, తండ్రి లేకపోవటంతో తల్లి కష్టపడి శివను చదివిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ కారణాలతో శివ మరణించాడో తెలియరాలేదు. ఇది హత్య, ఆత్మహత్య అన్నది కూడా స్పష్టంగా తేలాల్సి ఉంది. ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో భయం నెలకొంది.
సెక్యూరిటీ వైఫల్యమేనా...!
విద్యార్థి మృతిపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. గురువారం రాత్రి 11.30గంటల వరకు తనకు కేటాయించిన ఐ2 హాస్టల్‌లోని గదిలో ఉన్న అతను బయటకు ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎటువైపు నుంచి వెళ్ళాడనే విషయాలు అంతుబట్టడం లేదు. ప్రతిషిఫ్టుకు 40 నుంచి 50 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా హాస్టల్ గదిలో నుంచి బయటకు ఎలా వెళ్ళాడనే దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్లు ఆచార్య వీరంకి వెంకటదాసు, ఆచార్య పప్పల అప్పలనాయుడు ఏలూరులోని రైల్వే పోలీసుల వద్దకు వెళ్ళారు.
Advertisement
Advertisement