మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : ఐకేపీ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి మహిళా గ్రూపు సభ్యులకు తెలియకుండా రూ.లక్షలను స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి బాధిత మహిళల కథనం ఇలా ఉంది. మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ గ్రామంలో 34 మహిళా గ్రూపులున్నాయి. కాగా గ్రామానికి చెందిన స్రవంతి, శ్రీఆంజనేయ, ఇందిర గ్రూపులతో పాటు శ్రీనిధి పథకం నుంచి సదరు సభ్యులకు తెలియకుండా గ్రామ వెలుగు సీఏ కార్యాలయానికి చెందిన ఓ అధికారిణి సహకారంతో సుమారు రూ. 5 లక్షలను డ్రాచేశారని బాధిత మహిళలు శనివారం విలేకరుల ముందు వాపోయారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే ఖాతాలనుంచి గత ఆరునెలలుగా డబ్బులను డ్రా చేశారని పేర్కొన్నారు.
ఈ విషయం తమకు తెలియడంతో సంబంధిత ఐకేపీ అధికారుల దృష్టికి తీసుకవెళ్లామన్నారు. వారు వచ్చి డ్రా చేసిన డబ్బులను తిరిగి బ్యాంకులో జమ చేయాలని చెప్పి, సదరు వెలుగు సీఏకు కొంత సమయం ఇచ్చారని తెలిపారు. దీంతో కొద్దిపాటి డబ్బులను తిరిగి చెల్లించిన సదరు సీఏ ఇచ్చిన వాయిదాల ప్రకారం బ్యాంకులో కట్టడంలేదని తెలిపారు. దీంతో తమకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలను కోల్పోతున్నామని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమానికి పాల్పడిన సీఏతో పాటు ఆమెకు సహకరించిన అధికారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారి వివరణ
ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం సరితను న్యూస్‌లైన్ వివరణ కోరగా హవేళిఘణపూర్ గ్రామంలో మూడు మహిళా గ్రూపులతో పాటు శ్రీనిధి నుంచి గ్రామ సీఏ సుమారు రూ. 5 లక్షలు స్వాహా చేసిన మాట వాస్తవమేనన్నారు. కాగా తిరిగి బ్యాంకులో జమచేయాలని చెప్పి కొంత వ్యవధి ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రూ. 50 వేలు రికవరీ చేశామని త్వరలో మొత్తం రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోగా చెల్లించకుంటే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఐకేపీ ప్రాజెక్టు డెరైక్టర్ దృష్టికి సైతం తీసుకవెళ్లామని తెలిపారు. కాగా ఈ విషయంలో సీఏతో పాటు మరో అధికారి హస్తం ఉందని సదరు సీఏ తెలిపారన్నారు. కాగా ఆదిశగా కూడా విచారణ చేపడతున్నామని తెలిపారు. విచారణలో వాస్తవాలు తేలితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.