IKP staff
-
ఇదీ..‘చంద్రన్న బీమా’ చోద్యం!
చిత్తూరు, పెద్దతిప్పసముద్రం: అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఈమె పరిస్థితి. అధికారుల అలసత్వం కారణంగా ఈ అమాయక మహిళ గత రెండేళ్లుగా ఐకేపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగలేదు. వివరాల్లోకి వెళితే మండలంలోని పులికల్లు పంచాయతీ వీరగంగన్నగారిపల్లికి చెందిన వై. వెంకట్రమణ, సరస్వతి దంపతుల కుమారుడు రమేష్ బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ పులికల్లులోని నాగేశ్వరస్వామి ఆలయంలో తల దాచుకుని జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ యజమాని వై.వెంకట్రమణ అనారో గ్యం కారణంగా 2017 అక్టోబర్ 4న మృతి చెందాడు. చంద్రన్న బీమా ద్వారా దహన సంస్కారాలకు రూ.5 వేల నగదు ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సి వున్నా ఇంతవరకు అధికారులు నయా పైసా కూడా అందజేయలేదు. పలుమార్లు ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఈమె గోడు పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చంద్రన్న బీమా సొమ్ము మంజూరు చేసి న్యాయం చేయాలని బాధితురాలు సోమవారం ఐకేపీ ఏపీఎం మధుశేఖర్ బాబుకు విన్నవించింది. -
పింఛన్ల కోసం ‘పండుటాకుల’ నిరీక్షణ
సంగారెడ్డి మున్సిపాలిటీ : తమకు ఇప్పటివరకు చెల్లిస్తున్న పింఛన్లను నిలిపివేయడంతో అధికారులను అడిగి తెలుసుకొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధులకు సమాధానమిచ్చే సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోయారు. దీంతో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం ఎదుట నిరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించి 274 మంది వృద్ధుల పింఛన్లను వివిధ కారణాలతో ప్రభుత్వం రద్దు చేసింది. ఈనెల 9 నుంచి ఐకేపీ సిబ్బంది ద్వారా పింఛన్లను వార్డుల్లో పంపిణీ చేయడంతో ఎప్పటి లాగే పింఛన్ తీసుకొనేందుకు వెళ్లిన వృద్ధులకు ఈనెల పింఛను రాలేదని సిబ్బంది చెప్పడంతో వారు అవాక్కయ్యారు. కారణం తెలుసుకునేందుకు వారు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో సైతం ఎవరూ లేకపోవడంతో వారు సాయంత్రం వరకు వేచి చూసి ఉసూరు మంటూ వెనుదిరిగారు. -
‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం
- పజ్జూరు ఐకేపీ కేంద్రంలోనే పేరుకుపోయిన 30 లారీల ధాన్యం - లారీల కొరతను సాకుగా చూపుతున్న నిర్వాహకులు - సొంత ఖర్చులతో రవాణా చేసుకుంటున్న రైతులు - చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో సంఘబంధాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చిన రైతన్నకు వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు సకాలంలో ధాన్యం కాటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు గన్నిబ్యాగు(బస్తాలు)లు సరిపడా వున్నప్పటికీ కొన్ని చోట్ల కాంటా వేయడం లేదని తెలుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే హమాలీల కొరత ఉందని చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల లారీల కొరత ఉండటం కారణంగా ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. అంతేకాకుండా కొన్ని ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని నాలుగైదు మిల్లులకు పంపించడం వల్ల మిల్లర్లు, లోడుకు 6 నుంచి 8 క్వింటాళ్ల తరుగు చూపుతున్నారని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. గడ్డికొండారం ఐకేపీ కేంద్రం నుంచి మిర్యాలగూడలోని మహేశ్వరి మిల్లుకు మూడు రోజులుగా ధాన్యం తరలిస్తున్నారు. ఆ మిల్లు యాజమాన్యం తరుగు ఎక్కువగా చూపుతుండటంతో ఐకేపీ సిబ్బంది, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పజ్జూరు ఐకేపీ కేంద్రం తీరిది తిప్పర్తితో పాటు పజ్జూరు ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. ఒక్క పజ్జూరు ఐకేపీ కేంద్రానికే సుమారు 25 లారీల ధాన్యం వచ్చింది. ఇందులో 8 లారీలకు సరిపడా ధాన్యం కాంటా వేసి బస్తాల్లో ఉంచారు. కాంటా వేసి వారం రోజులవుతున్నా ఒక్క లారీ కూడా రాకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిస్తోంది. మూ డు రోజుల కిత్రం వచ్చిన వర్షానికి ధాన్యా న్ని రక్షించేం దుకు సిబ్బంది పడిన అవస్థలు అంతాఇంతా కాదు. లారీలను సమకూర్చే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది, రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గడ్డికొండారంలో దయనీయ పరిస్థితి గడ్డికొండారం ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని తరలించుకోవాలని, లేదంటే ధాన్యం కొనుగోలు చేయమని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. చేసేదేమి లేక రైతులే కిరాయి చెల్లించి తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. -
ఐకేపీ సిబ్బంది చేతివాటం
మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : ఐకేపీ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి మహిళా గ్రూపు సభ్యులకు తెలియకుండా రూ.లక్షలను స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి బాధిత మహిళల కథనం ఇలా ఉంది. మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ గ్రామంలో 34 మహిళా గ్రూపులున్నాయి. కాగా గ్రామానికి చెందిన స్రవంతి, శ్రీఆంజనేయ, ఇందిర గ్రూపులతో పాటు శ్రీనిధి పథకం నుంచి సదరు సభ్యులకు తెలియకుండా గ్రామ వెలుగు సీఏ కార్యాలయానికి చెందిన ఓ అధికారిణి సహకారంతో సుమారు రూ. 5 లక్షలను డ్రాచేశారని బాధిత మహిళలు శనివారం విలేకరుల ముందు వాపోయారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే ఖాతాలనుంచి గత ఆరునెలలుగా డబ్బులను డ్రా చేశారని పేర్కొన్నారు. ఈ విషయం తమకు తెలియడంతో సంబంధిత ఐకేపీ అధికారుల దృష్టికి తీసుకవెళ్లామన్నారు. వారు వచ్చి డ్రా చేసిన డబ్బులను తిరిగి బ్యాంకులో జమ చేయాలని చెప్పి, సదరు వెలుగు సీఏకు కొంత సమయం ఇచ్చారని తెలిపారు. దీంతో కొద్దిపాటి డబ్బులను తిరిగి చెల్లించిన సదరు సీఏ ఇచ్చిన వాయిదాల ప్రకారం బ్యాంకులో కట్టడంలేదని తెలిపారు. దీంతో తమకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలను కోల్పోతున్నామని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమానికి పాల్పడిన సీఏతో పాటు ఆమెకు సహకరించిన అధికారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారి వివరణ ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం సరితను న్యూస్‌లైన్ వివరణ కోరగా హవేళిఘణపూర్ గ్రామంలో మూడు మహిళా గ్రూపులతో పాటు శ్రీనిధి నుంచి గ్రామ సీఏ సుమారు రూ. 5 లక్షలు స్వాహా చేసిన మాట వాస్తవమేనన్నారు. కాగా తిరిగి బ్యాంకులో జమచేయాలని చెప్పి కొంత వ్యవధి ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రూ. 50 వేలు రికవరీ చేశామని త్వరలో మొత్తం రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోగా చెల్లించకుంటే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఐకేపీ ప్రాజెక్టు డెరైక్టర్ దృష్టికి సైతం తీసుకవెళ్లామని తెలిపారు. కాగా ఈ విషయంలో సీఏతో పాటు మరో అధికారి హస్తం ఉందని సదరు సీఏ తెలిపారన్నారు. కాగా ఆదిశగా కూడా విచారణ చేపడతున్నామని తెలిపారు. విచారణలో వాస్తవాలు తేలితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.