‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం | ikp center at grain | Sakshi
Sakshi News home page

‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం

Published Sat, May 31 2014 2:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం - Sakshi

‘ఐకేపీ’ల్లో మూలుగుతున్న ధాన్యం

- పజ్జూరు ఐకేపీ కేంద్రంలోనే పేరుకుపోయిన 30 లారీల ధాన్యం
- లారీల కొరతను సాకుగా చూపుతున్న నిర్వాహకులు
- సొంత ఖర్చులతో రవాణా చేసుకుంటున్న రైతులు
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో సంఘబంధాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు.  ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చిన రైతన్నకు వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు సకాలంలో ధాన్యం కాటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు గన్నిబ్యాగు(బస్తాలు)లు సరిపడా వున్నప్పటికీ కొన్ని చోట్ల కాంటా వేయడం లేదని తెలుస్తోంది.

 ఇదేమని ప్రశ్నిస్తే హమాలీల కొరత ఉందని చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల లారీల కొరత ఉండటం కారణంగా ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. అంతేకాకుండా కొన్ని ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యాన్ని నాలుగైదు మిల్లులకు పంపించడం వల్ల మిల్లర్లు, లోడుకు 6 నుంచి 8 క్వింటాళ్ల తరుగు చూపుతున్నారని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. గడ్డికొండారం ఐకేపీ కేంద్రం నుంచి మిర్యాలగూడలోని మహేశ్వరి మిల్లుకు మూడు రోజులుగా ధాన్యం తరలిస్తున్నారు. ఆ మిల్లు యాజమాన్యం తరుగు ఎక్కువగా చూపుతుండటంతో  ఐకేపీ సిబ్బంది, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పజ్జూరు ఐకేపీ కేంద్రం తీరిది
తిప్పర్తితో పాటు పజ్జూరు ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. ఒక్క పజ్జూరు ఐకేపీ కేంద్రానికే సుమారు 25 లారీల ధాన్యం వచ్చింది. ఇందులో 8 లారీలకు సరిపడా ధాన్యం కాంటా వేసి బస్తాల్లో ఉంచారు. కాంటా వేసి వారం రోజులవుతున్నా ఒక్క లారీ కూడా రాకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిస్తోంది. మూ డు రోజుల కిత్రం వచ్చిన వర్షానికి ధాన్యా న్ని రక్షించేం దుకు సిబ్బంది పడిన అవస్థలు అంతాఇంతా కాదు. లారీలను సమకూర్చే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది, రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

గడ్డికొండారంలో దయనీయ పరిస్థితి
గడ్డికొండారం ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని తరలించుకోవాలని, లేదంటే ధాన్యం కొనుగోలు చేయమని  ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. చేసేదేమి లేక రైతులే కిరాయి చెల్లించి  తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement