మహిళా కళాశాలలో బస్‌యాత్ర
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్
జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ క్యాంపస్ యాత్ర
ఖమ్మం:
తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యాపరంగా ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత, ఎంసెట్–2 పేపర్ లీకేజీల వంటి సంఘటనలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో క్యాంపస్ యాత్ర గురువారం ఖమ్మం చేరుకుంది. వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి.. యాత్రను ఖమ్మం నగరంలోని ఆహ్వానించారు. అనంతరం మహిళా కళాశాల, కేంద్రియ విద్యాలయం ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ మహిళా కళాశాల ప్రాంగణంలో మద్యం సీసాలు, అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, నగరం నడిబొడ్డులో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రియ విద్యాలయంలో 1220 మంది విద్యార్థులకు కేవలం నలుగురే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారని, 19మంది ఉపాధ్యాయులను ఒకేసారి బదిలీ చేయడం శోచనీయమన్నారు. ఇలా అయితే చదువులు ఎలా కొనసాగుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, చందన, సారిక, అనురాధ, మహేష్, సందీప్, ఉదయ్‌కుమార్, అజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.