‘ఎటు చూసినా అక్రమ లేఔట్లు’
కదిరి : 'కదిరి మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా అనుమతి లేకుండానే లేఔట్లు వేస్తున్నారు. ఈ విషయం అధికార పార్టీ నాయకులతో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతోంది. వారికి మామూళ్లు ముట్టజెప్పడంతో నోరుమెదపకుండా ఉన్నారు. మున్సిపల్ అధికారులే మున్సిపల్ ఆదాయానికి గండి కొడితే ఎలా?' అని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉట్టికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొందరు చదును చేసి ప్లాట్లుగా వేసి అమ్మడానికి సిద్ధం చేశారు.
మాజీ మంత్రి బుధవారం విలేకరులను ఆ స్థలంలోకి తీసుకెళ్లి అక్కడ అనుమతి లేకుండా లేఔట్ల వేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ కనుసన్నల్లోనే అదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తానే స్వయంగా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, దీనిపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మున్సిపల్ రిజర్వ్ స్థలాలన్నీ కబ్జా అయిపోయాయని, కానీ అధికారుల్లో మాత్రం ఏమాత్రం చలనం లేదన్నారు. దీనిపై త్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.