ఇల్లు.. గుభేలు
Published Fri, Jun 16 2017 1:47 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : నిర్మాణ రంగంపై ధరల భారం పెరిగిపోయింది. నిర్మాణ సామగ్రి ధరల్లో కొద్దిరోజుల్లోనే విపరీతమైన వ్యత్యాసం రావడంతో ఈ రంగం కుదేలవుతోంది. ముందుగా వేసుకున్న బడ్జెట్‌కు మించి ఖర్చు చేయాల్సి రావడంతో భవన నిర్మాణాలు చేపట్టిన వారు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. జూలై 1నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రానుంది. ఇది నిర్మాణ రంగంపై గోరుచుట్ట మీద రోకలిపోటులా పరిణవిుంచనుందనే ఆందోళన నెలకొంది.
పెరిగిన ఐరన్, సిమెంట్ ధరలు
భవన నిర్మాణానికి ఉపయోగించే ఐరన్ 6 నెలల క్రితం వరకూ టన్ను రూ.32 వేల (టీఎంటీ) నుంచి రూ. 36 వేల (ప్లాంట్) వరకూ ఉండేది. ప్రస్తుతం వాటి ధర రూ.39 వేల (టీఎంటీ) నుంచి రూ. 43 వేల (ప్లాంట్) వరకూ పెరిగింది. నిర్మాణ రంగంలో మరో కీలకమైన సిమెంట్ ధర మంటెక్కిస్తోంది. సాధారణంగా అన్‌సీజన్‌లో సిమెంట్ బస్తా రూ.220 నుంచి రూ.240 మధ్య ఉండేది. దీని ధర ఒక్కసారిగా రూ.330కి చేరుకుంది. బస్తాకు రూ.100 వరకు పెరిగిన ధర వల్ల సాధారణ గృహ నిర్మాణ బడ్జెట్‌లో రూ.2 లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి రావడంతో పనులను మధ్యలోనే ఆపేస్తున్నారు.
ఇటుక.. ఇసుకదీ అదేదారి
ఇసుక, ఇటుక ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గతంలో వెయ్యి ఇటుకలు రూ.3,500 ఉండగా ఇప్పుడు రూ.5,500 వెచ్చించాల్సి వస్తోంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కారణంగా ఉచి తంగా అందాల్సింది పోయి దానికీ వేలల్లోనే చెల్లించాల్సి వస్తోంది. ఇసుక వ్యాపారం మాఫియా చేతిలోకి వెళ్లటంతో దీని ధర కూడా బాగా పెరిగిపోయింది. యూనిట్‌కు రూ.2,500 వరకు చెల్లించాలి్సన దుస్థితి నెలకొంది. గృహ నిర్మాణానికి ఉపయోగించే అన్ని వస్తువుల ధరలూ నింగివైపు చూస్తుండటంతో యజమానులు నిర్మాణ పనులను ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
అన్‌సీజన్ అయినా తగ్గని ధరలు
వేసవి ముగిసి వర్షాకాలం రావడంతో గృహ నిర్మాణ రంగం అన్‌సీజన్‌లో పడింది. ఆషాఢ మాసం రాబోతున్న తరుణంలో గృహ నిర్మాణాలను ప్రారంభించరు. దీంతో నిర్మాణ సామగ్రికి పెద్దగా డిమాండ్ ఉండదు. అయినా.. ప్రస్తుతం వాటి ధరలు దిగిరాకపోవడం విశేషం.
ఉపాధి కోల్పోతున్న కార్మికులు
వర్షాకాలంలో నిర్మాణాలు తగ్గి కూలీలు సహజంగానే ఉపాధి కోల్పోతుంటారు. ఈ ఏడాది ఇప్పటికీ ధరలు తగ్గకపోవడం, ప్రారంభించిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో వర్షాకాలం తొలి రోజు ల్లోనే కూలీలు ఉపాధికి దూరమౌతున్నారు.
రోకలిపోటులా జీఎస్టీ
జూలై 1నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ ప్రభావం గృహ నిర్మాణ సామగ్రిపైనా పడనుంది. టైల్స్, ఫ్లైయాష్ బ్రిక్స్, వాల్ పేపర్స్, పెయింట్లు వంటి గృహనిర్మాణ వస్తువుల ధరలు జీఎస్టీ ప్రభావంతో పెరిగే అవకాశముంది.
గతంలో ఎప్పుడూ లేదు
నిర్మాణ రంగంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. వర్షాకాలంలో నిర్మాణ వస్తువుల ధరలు తగ్గాల్సి ఉంది. ప్రస్తుత తీరును విశ్లేషిస్తే ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. కొత్తగా అమల్లోకి రాబోతున్న జీఎస్టీ ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.
– కె.సోమశేఖర్, సివిల్ ఇంజినీర్, ఏలూరు
Advertisement