
కేసీఆర్‌పై భ్రమలు తొలిగిపోయాయి
♦ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
♦ కుంభకోణాలు, కమీషన్లతో కాలయాపన
♦ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం
♦ సర్కారుపై ధ్వజమెత్తిన టీడీపీ జిల్లా ఇన్‌చార్జి అరవింద్‌కుమార్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ సర్కారు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుందని టీడీపీ జిల్లా ఇన్‌చార్జి అరవింద్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాలం గడుపుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాలంలోనే రూ.70 వేల కోట్ల అప్పులు చేసి.. మిగులు రాష్ట్రాన్ని కాస్తా లోటులోకి తీసుకెళ్లిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరిట కమీషన్ల దండుకుంటున్న టీఆర్‌ఎస్ మంత్రులు.. ఎంసెట్ పేపర్ లీకేజీ నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు.
వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్.. కార్పొరేట్ కాలేజీల కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, త్వరలోనే ఆ పార్టీ పతనం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉందని, గ్రామ, వార్డు కమిటీలను బలోపేతం చేయడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తెస్తామన్నారు. సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, నాయకులు సామ భూపాల్‌రెడ్డి, గణేశ్‌గుప్తా, సూర్యప్రకాశ్, రొక్కం భీంరెడ్డి, బుక్కా గోపాల్, చంద్రయ్య, శేరి పెంటారెడ్డి, ఉదయ్‌మోహన్‌రెడ్డి, మోహన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
5న కలెక్టరేట్ ఎదుట ధర్నా..
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈనెల 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌యాదవ్ తెలిపారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, రుణమాఫీని పూర్తిగా వర్తింపజేయాలని, ఎంసెట్ లీకేజీ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడతామని చెప్పారు. కాగా, ఈనెల 2,3వ తేదీల్లో నియోజకవర్గాల్లో పార్టీ విస్తత స్థాయి కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. 2న రాజేంద్రనగర్, ఉప్పల్, 3న తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల సమావేశాలుంటాయని వివరించారు.