
కేసీఆర్ పతనం పటాన్‌చెరు నుంచే: రేవంత్
పటాన్‌చెరు: ‘పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి కోర్టు విధించిన తీర్పు ప్రకారం అనర్హత వేటు పడింది. ఇక ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం.. టీడీపీ విజయం ఖాయం’ అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పతనం పటాన్‌చెరు నుంచే ప్రారంభం కానుందని జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఇంటింటింకి వెళ్లి ఓట్లడుగుతానని. టీ డీపీ అభ్యర్థి గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు.
ముఖ్యమంత్రి తన కూతురు కవిత అడిగితే బతుకమ్మ ఆటాడుకునేందుకు రూ.పది కోట్లు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు త్వరలో చరమగీతం పాడుతారన్నారు. నారాయణఖేడ్, పటాన్‌చెరు శాసనసభలకు జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ‘సూటు బూటు వేసుకుని కేటీఆర్ శిల్పారామంలో ఇంగిల్‌పీసులో బాగానే మాట్లాడుతుండు.. ఆయన అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. హైటెక్‌సిటీ, గూగుల్ సంస్థలు వచ్చాయి. అప్పటి సీఎం చంద్రబాబు విదేశాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలతో మాట్లాడి హైదరాబాద్‌కు వీటన్నింటినీ రప్పించారు’ అని రేవంత్‌రెడ్డి వివరించారు.