విశాఖపట్నం: రాష్ట్రంలోని మూడు జిల్లాలు పెనుతుపాన్ల తాకిడికి గురయ్యే ప్రాంతాల జాబితాలో ఉన్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గుర్తించింది. తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు పెను తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉందని ఐఎండీ ఓ నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తుపాన్ల తాకిడి తీవ్రంగా ఉండే జిల్లాలపై ఐఎండీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని 12 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.
వాటిలో మన రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరికి ఆనుకుని ఉన్న యానాం కూడా ఉన్నట్టు ప్రకటించారు. మిగిలిన వాటిలో ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగ్జిత్‌సింగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ, మిడ్నాపూర్, కోల్‌కతా జిల్లాలు ఉన్నాయి. 1891 నుంచి 2010 వరకు సంభవించిన తుపాన్లు ఎక్కువ సార్లు తీరాన్ని తాకడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు.