సిద్దిపేట అర్బన్: వంద సంత్సరాలు తలక్రిందులుగా తపస్సు చేసినా నగదు రహిత లావాదేవీలు సాధ్యం కావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన సింగపూర్, అమెరికా లాంటి దేశాల్లోనే సుమారు 50శాతం నగదు రహిత లావాదేవిలు జరుగుతున్నాయని, రెండు శాతం ఉన్న మనదేశంలో 100శాతం ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అనాలోచిత చర్య అని, ఈ విషయంలో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందన్నారు. ఆర్థిక నిపుణులతో చర్చించకుండా, ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో కూలీ పనులు చేసుకోవాల్సిన వారు క్యూల్లో ఉంటున్నారన్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తెస్తానని పెద్దనోట్లను రద్దు చేయడం ‘పుండొక చోటుంటే మందొక చోట’ అన్నట్లుందన్నారు. మోదీ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, అందుకే ప్రజల దృష్టికి మల్లించేందుకు నోట్లరద్దును ముందుకు తెచ్చిందన్నారు. వందల కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్దీ బంగారం బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లల్లో బయటకు వస్తుందన్నారు. నోట్ల రద్దుతో ప్రజల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని, ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు.
విశ్వాసం లేని పాలన చేస్తున్న కేసీఆర్..
మోడీ తీరుకు ముగ్దుడయిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడన్నారు. ఉద్యమంలో ముందున్న వారిని పక్కనపెట్టి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని మంత్రి వర్గంలో చేర్చుకున్నాడన్నారు. విమలక్క కార్యాలయంపై సోదాలు చేయడం పౌరహక్కులకు భంగం కలిగించే చర్య అని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు వెంకట్రాంరెడ్డి, సృజన్‌కుమార్, పీవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరుకు సిద్ధంకండి..
సిద్దిపేట అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చా రు. సీపీఐ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, క్షేత్రస్థాయిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పర్యటించి, పార్టీ నాయకత్వం ప్రజాసమస్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బలమైన ప్రజాపోరాటాలను నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలోని కొత్త జిల్లాలో పార్టీని పటిష్టవంతం చేసేందుకు అనేక అవకాశాలున్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజా ఉద్యమాల ద్వారానే బలమైన పార్టీ నిర్మాణం జరగుతుందని, అందుకోసం కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. ఈ నెల 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు, సభలు నిర్వహించాలన్నారు. 2017 సంవత్సరాన్ని ప్రజా ఉద్యమాల సంవత్సరంగా పరిగణించి ఉద్యమ కార్యచరణతో ప్రభుత్వ అసమర్థ పరిపాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనను శాలువాతో సన్మానించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మందపవన్, కార్యవర్గ సభ్యులు పెండెల అయిలయ్య, కొయ్యడ సృజన్‌కుమార్, మచ్చ శ్రీనివాస్, పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి, వెల్పుల బాలమల్లు, గడిపె మల్లేశ్, నాయకులు ఎడ్ల వెంకట్రాంరెడ్డి, కనుకవ్వ, పీవీ.నర్సింహారెడ్డి, మన్నె కుమార్, జనార్దన్, శంకర్, రాజరెడ్డి, లక్ష్మణ్, శోభన్, ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి, భూమయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
నగదు రహితం అసాధ్యం
Published Tue, Dec 13 2016 11:46 PM | Last Updated on Mon, Aug 13 2018 6:20 PM
Advertisement
Advertisement