విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి
గుంటూరు ఎడ్యుకేషన్ : మోడల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగుçపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ భవన్‌లో మంగళవారం నాలుగు జిల్లాల పరిధిలోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ తరహాలో నాణ్యమైన విద్యను అందించేందుకు స్థాపించిన మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు నూరు శాతం పూర్తి చేసేందుకు పటిష్టచర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్‌ఎంఎంఎస్, ఎన్‌టీఎస్‌ఈ వంటి ప్రతిభ పరీక్షల్లో ప్రతిభ చూపే విధంగా ప్రోత్సహించడంతో పాటు త్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మోడల్ స్కూళ్ల పరిధిలో గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియెట్‌లో నమోదై ఫలితాలపై సమీక్షించిన కమిషనర్ వచ్చే ఏడాది పరీక్షల్లో ఆయా పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగారు. అనంతరం ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2, ఎస్‌ఏ–1 పరీక్ష ఫలితాలు, విద్యార్థుల నమోదు, ప్రతిభా అవార్డులు, ఇతర పరిపాలన అంశాలపై చర్చించారు. సమావేశంలో పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, ఆర్‌ఎంఎస్‌ఏ డైరెక్టర్ పి.ప్రభాకర్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, డీవైఈవోలు తదితరులు పాల్గొన్నారు.