రాష్ట్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు | Improved medical facilities in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు

Published Sun, Dec 6 2015 3:43 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

రాష్ట్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు - Sakshi

రాష్ట్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తున్నాయని అమెరికా వైద్య సౌకర్యాల పరిశోధనా సంస్థ గిలీడ్ సెన్సైస్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు.. ప్రైవేటురంగంలోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్ సెన్సైస్ ప్రతినిధులు శనివారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారితో కలసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం మండల కేంద్రాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయని... కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు విదేశాల్లోని వైద్య నిపుణులను టెలిమెడిసిన్ ద్వారా సంప్రదిస్తూ వైద్యం అందిస్తున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మెరుగైన వైద్యం కోసం రోగులు హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య సౌకర్యాల రంగంలో తమ గిలీడ్ సెన్సైస్ సంస్థ ప్రత్యేకతలను ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌కు వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీగా పేరొందిన తమ సంస్థ... 16 దేశాలతోపాటు తెలంగాణలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వైద్య, ఆరోగ్య కార్యక్రమాల్లో తమ సంస్థ పాల్గొంటుందని సంసిద్ధత వ్యక్తం చేశారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీలో తమ యూనిట్ నెలకొల్పుతామని చెప్పారు.

 పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం..
 అమెరికా ఐటీ పరిశ్రమతో రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల కార్యాలయాలు సైతం హైదరాబాద్‌లో ఉన్నాయని గిలీడ్ సెన్సైస్ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుసరిస్తున్న విధానాన్ని వివరించడంతో పాటు టీఎస్‌ఐపాస్ మార్గదర్శకాల ప్రతిని అందజేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం డిజైన్ చూపిస్తూ.. రాష్ట్రంలో పది లక్షల గృహాలు నిర్మిస్తామన్నారు. రక్షిత నీటి సరఫరాకు చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా అంటు వ్యాధులను తగ్గిస్తామని చెప్పారు. వివిధ రాష్ట్రాల అభివృద్ధిపైనే దేశ పురోగతి ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సీఎంతో జరిగిన భేటీలో గిలీడ్ సెన్సైస్ డెరైక్టర్లు అరోన్ బ్రింక్‌వర్త్, క్లాడియో లిలియెన్ ఫీల్డ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు డీజీపీ అనురాగ్ శర్మ, హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement