మహానందీశ్వరుడి సాక్షిగా..
మహానందీశ్వరుడి సాక్షిగా..
Published Thu, Nov 17 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
- రూ. లక్షల్లో నోట్ల మార్పిడి
- అధికార పార్టీ నేత అండగా ఓ అధికారి కక్కుర్తి
- సిబ్బంది భాగస్వామ్యం
- 13 మందికి షోకాజ్ నోటీసులు
మహానంది: నల్లకుబేరులు పెద్ద నోట్ల మార్పిడికి మహానంది క్షేత్రాన్ని అడ్డాగా మార్చుకున్నారు. ఓ అధికారి సహకారంతో నల్లడబ్బును తెల్లగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకున్న వారిలో ధర్మకర్తల మండలి సభ్యులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ తంతగంలో ఓ చిరుద్యోగి తన హవాను కొనసాగిస్తున్నాడు. గత ఆది, సోమవారాల్లో రెండురోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. ఆదివారం సెలవురోజు కావడంతో సుమారు రూ. 4లక్షలు, కార్తీక పౌర్ణమి కావడంతో సోమవారం భక్తులరద్దీ అధికంగా ఉండటంతో రూ. 5లక్షల వరకు ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో రూ. 9లక్షలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులరద్దీ, ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు రోజులనే నల్లకుబేరులు టార్గెట్ చేశారు. అధికార పార్టీ అండగా ఓ ఉద్యోగి కింది స్థాయి సిబ్బంది సహకారంతో రెండు రోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి చేసినట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఎనిమిది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఏజేన్సీ ఉద్యోగులు కలిపి 21 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వీరిలో స్థానిక అధికారపార్టీ నేతతో పాటు ఓ ఉద్యోగి బంధువు, మరికొందరు స్థానికులు ఉన్నారని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.అలాగే లోకాయుక్తను ఆశ్రయించి కేసు వేస్తామన్నారు.
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: శంకర వరప్రసాద్, డిప్యూటీ కమిషనర్, మహానంది
నోట్ల మార్పిడిలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజేన్సీ, ఔట్‌సోర్సింగ్, ఇతరులకు కలిపి మొత్తం 21 మందికి షోకాజ్‌నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాము.ఆది, సోమవారాల్లో కలిపి రూ. 2.64లక్షల మార్పిడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విచారణ అనంతరం బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవు.
Advertisement