
ఆర్జీ–1లో పుంజుకుంటున్న బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని : ఆర్జీ–1 ఏరియాలో గతంతో పోల్చుకుంటే బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని సీజీఎం సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే 1వ గనిలో గడిచిన డిసెంబర్‌లో 106 శాతం, జీడీకే 5వ గనిలో 105 శాతం, మేడిపల్లి ఓసీపీలో 117 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. జీడీకె 11వగనిలో కంటిన్యూయస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి వెలికితీయడం ప్రారంభమైందని, మేడిపల్లి ఓసీపీలో కూడా మరింత ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి రానుందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న మూడునెలల్లో ఆర్జీ–1 ఏరియాకు నిర్దేశించిన 62 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించగలుగుతామని దీమా వ్యక్తం చేశారు. మేడిపల్లి ఓసీపీ గడిచిన తొమ్మిది నెలల కాలంలో వంద శాతం బొగ్గు ఉత్పత్తి చేసి ముందు వరుసలో ఉందన్నారు. జీడీకే 1 సీఎస్‌పీ నుంచి గత నవంబర్ నెలలో 122 ర్యాక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేస్తే...డిసెంబర్‌లో 128 ర్యాక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేశామని, ఇది సీఎస్‌పీ చరిత్రలో ఉత్తమమైన ప్రతిభ అని ఆయన ప్రకటించారు.
జి–5 గ్రేడ్ బొగ్గు రవాణాకు చర్యలు...
సింగరేణి సంస్థ తమిళనాడులోని జెన్ కో సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు భూపాలపల్లి డివిజన లో లభించే జి–5 గ్రేడ్ బొగ్గును గోదావరిఖనికి లారీల ద్వారా తెప్పించి ఇక్కడి జీడీకె–1 సీఎస్‌పీ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీజీఎం సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జి–5 గ్రేడ్ బొగ్గు రవాణాకు ట్రయల్ రన్ నిర్వహించామని, ముందుగా ఒక ర్యాక్(సుమారు 4 వేల టన్నుల బొగ్గు)నింపడానికి ఆరు గంటల సమయం పట్టిందని, ఆ తర్వాత పలు చర్యలు తీసుకోవడంతో ఆ సమయం మూడు గంటలకు తగ్గిందన్నారు. మరో వారం రోజుల్లో తమిళనాడుకు పూర్తి స్థాయిలో జి–5 గ్రేడ్ బొగ్గు రవాణా చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటు సీజీఎం ఎ.సుధాకర్‌రెడ్డి, హన్మంతరావు, సాయిరామ్, రాజేశ్వరరావు, సూర్యనారాయణ, మంచాల శ్రీనివాస్, రమేశ్, గంగాధర్, ప్రకాశ్ పాల్గొన్నారు.