శ్రీశైలం వెళ్తుండగా..
Published Thu, Feb 16 2017 11:09 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- బైక్‌లను ఢీకొన్న కారు
- ఇద్దరు శివమాలధారులు మృతి
- నలుగురికి తీవ్ర గాయాలు
- మృతులు అనంతపురం జిల్లా వాసులు
నూనెపల్లె/ధర్మవరం నంద్యాల సమీపంలో కొత్తపల్లె గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శివమాలధారులు మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం కునుకుట్ల గ్రామానికి చెందిన శివమాల ధరించిన 35 మంది శ్రీశైలం వెళ్లడానికి బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇరుముడి కట్టుకున్నారు. ఆ రోజు రాత్రి స్థానిక శివాలయంలోనే నిద్రించి గురువారం ఉదయం 5.30 గంటలకు శివమాల ధరించిన భక్తులు, మరో 40 మంది సాధారణ భక్తులు బైకుల్లోను, మరో 20 మంది మూడు కార్లల్లో శ్రీశైలం బయలుదేరారు. ఉదయం 9.30 గంటల సమయంలో నంద్యాల దాటగానే కొత్తపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న కారు.. ఆటోను తప్పించబోయి వరుసగా నాలుగు బైకులను ఢీ కొంది.
ఈ ప్రమాదంలో కునుకుట్ల గ్రామానికి చెందిన వడ్డి పుల్లారెడ్డి(65), వడ్డి చిన్నరామలింగారెడ్డి(38) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు తరలిస్తుండగా పుల్లారెడ్డి, ఆసుపత్రిలో చిన్నరామలింగారెడ్డి మృతి చెందారు. మరో నలుగురు బాధితులు వడ్డి శివారెడ్డి, వడ్డి రామచంద్రారెడ్డి, వడ్డి రామాంజులరెడ్డి, ఉప్పర శ్రీనివాసులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మృతుడు పుల్లారెడ్డికి భార్య లక్ష్మీదేవి, నలుగురు కూతుర్లు, కుమారుడు నాగలింగారెడ్డి ఉన్నారు. చిన్నరామలింగారెడ్డికి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుర్లు పూజిత(14), పావని(12), ఒక కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి(9) ఉన్నారు. రోడ్డు ప్రమాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Advertisement
Advertisement