సమాజంపై అవగాహన పెంచుకోవాలి
రెంజల్ : విద్యార్థులు విద్యతోపాటు సమాజంపైనా అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య సూచించారు. రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వందేమాతరం, మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 20 కేజీబీవీలనుంచి విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. పది రోజులపాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. ‘‘లిటిల్ లీడర్స్.. లిటిల్ టీచర్స్’’ అనే అంశం ఆధారంగా శిక్షణ కొనసాగుతోందన్నారు. శిక్షణ పొందినవారు తమ విద్యాలయంలో తోటి విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. దసరా, సంక్రాత్రి, వేసవి సెలవుల్లో ఈ పద్ధతులను విస్తరిస్తామన్నారు.
‘‘లిటిల్ లీడర్స్.. లిటిల్ టీచర్స్’’ అంశంపై కామారెడ్డి ప్రాంతానికి చెందిన 42 మంది బాలికలకు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో శిక్షణ ఇప్పించామని వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిరెడ్డి, మై విలేజ్ మోడల్ విలేజ్ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రెంజల్ కస్తూర్బా విద్యాలయంలో శిక్షణ పొందుతున్న 300 మంది బాలికలకు వారే శిక్షణ ఇస్తున్నారన్నారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్‌ను తమ ఫౌండేషన్ అందిస్తోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో పద్మనాభన్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎంఈవో సంజీవ్‌రెడ్డి, సర్పంచ్ సవిత, ఎంపీటీసీ సభ్యురాలు కవిత, ఎస్సై రవికుమార్, పాఠశాల నిర్వాహకురాలు మమత తదితరులు పాల్గొన్నారు.