నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి
- పంట కుంటల నిర్మాణంతో సత్ఫలితాలు
- గవర్నర్ నరసింహన్
గార్లదిన్నె :
నీటి వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పండ్లతోటల పెంపకాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. మంగళవారం ఆయన గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో పంటకుంటల నిర్మాణాలు, మల్చింగ్, బిందు, తుంపర సేద్యం ద్వారా అంజూర, చీనీ తోటల సాగును పరిశీలించారు. గార్లదిన్నె మండల ఆరోగ్య కేంద్రంలో ఫిజోమీటరు పనితీరును పరిశీలించారు. జిల్లాలో భూగర్భజలాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ముకుందాపురం గ్రామానికి చెందిన ఎన్.పద్మావతి పొలంలో నిర్మిస్తున్న పంట కుంటను చూశారు. మస్టర్‌ను పరిశీలించి.
అక్కడున్న కూలీలను పేరుతో పిలుస్తూ పంటకుంటల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. వీటిని ఎన్నిరోజులుగా తవ్వుతున్నారని, రోజుకు ఎంతకూలి వస్తోందని సుబ్బలక్ష్మి అనే ఉపాధి కూలీని అడిగారు. ఆరు వారాలుగా తవ్వుతున్నామని, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కొంత తక్కువ కూలి వచ్చినా ఇప్పుడు రోజుకు సరాసరి రూ.195లు లభిస్తున్నట్లు ఆమె వివరించారు. రామాంజినేయులు అనే ఉపాధి కూలీతో గవర్నర్ మాట్లాడుతూ ఏమి చదువుకున్నావని అడిగారు. తాను చదువుకోలేదని చెప్పగా.. రాత్రి బడి ద్వారా విద్యను అందించాలని అధికారులకు సూచించారు.
ఇది కాక ఇతర ఏ పనులు చేస్తావని అడగ్గా.. 150 ఉపాధి పని దినాలు పూర్తి కావడంతో ఇతర పనులకు వెళుతున్నానన్నారు. తాను నేత కార్మికుడినని, ఆ పని గిట్టుబాటు కాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్తున్నానని రామచంద్ర అనే వ్యక్తి తెలిపారు. ధర్మవరం పట్టుచీరలు ప్రఖ్యాతి గాంచినవని, ప్రభుత్వ సబ్సిడీ రుణాల ద్వారా లబ్ధి పొంది చేనేత వృత్తిని కొనసాగించాలని సూచించారు. అనంతరం బాలాజీ అనే రైతు సాగు చేస్తున్న అంజూర పంట పొలాన్ని గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద అంజూర సాగును ప్రోత్సహిస్తున్నట్లు గవర్నర్‌కు వివరించారు. జిల్లాలో పండ్లతోటల ఉత్పత్తులు 40 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్నాయని, తద్వారా రూ.5,266 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. రూ.6,200 కోట్లను సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతులకు సూచనలు, సలహాలను అందించి అధిక దిగుబడి సాధించేందుకు కృషి చేయాలని నరసింహన్ సూచించారు. ఆ తర్వాత బిందు, తుంపర సేద్యం ద్వారా మల్చింగ్ విధానంలో చీనీ, కళింగర సాగుచేస్తున్న రవిచంద్రారెడ్డి అనే రైతు పొలాన్ని గవర్నర్ సందర్శించారు.
జిల్లాలో మూడేళ్లుగా 15 వేల హెక్టార్లలో మల్చింగ్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారని ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు. డ్రిప్ ద్వారా మందులు, ఎరువులను ఇస్తుండటంతో 50–60 శాతం ఆదా చేయగలుగుతున్నారని తెలిపారు. జిల్లాలో 27,358 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించామని, రాష్ట్రంలోనే అనంత ప్రథమస్థానంలో ఉందని చెప్పారు. అక్కడే ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం నీరు–ప్రగతి కింద పంటకుంటలను తానే ప్రారంభించానని గుర్తు చేశారు. కరువు రహిత జిల్లాగా మార్చేందుకు పంట కుంటలు ఎంతో దోహదపడతాయన్నారు. రైతులు ఒకేరకమైన పంటలను కాకుండా ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, అనంతపురం ఆర్డీఓ మాలోల, ఎస్పీ రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.