అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి
♦ మున్సిపాలిటీల్లో ఇంటికో మొక్క నాటాలి
♦ జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
♦ తాండూరులో మొక్క నాటిన మంత్రి మహేందర్‌రెడ్డి
తాండూరు: తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అడవుల విస్తీర్ణం పెరగటంవల్ల భవిష్యత్తులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని పది జిల్లాలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో 1.20 లక్షల మొక్కలు నాటాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు మంత్రి చెప్పారు. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెంచడానికి ఆయా జిల్లాల్లో అధికంగా మొక్కలు నాటనున్నట్టు వివరించారు. మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇంటికో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.నాటిన మొక్కలను సంరక్షించడం బాధ్యతగా ప్రజలందరూ భావించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు సినీనటులు హరితహారంలో భాగస్వామ్యం కావడం మంచి పరిణామమన్నారు. జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. అంతకుముందు మంత్రి హరితహారం పతకాన్ని ఆవిష్కరించి, పావురాన్ని ఎగురవేసి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, టీఆర్‌ఎస్, టీడీపీ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్లు అబ్దుల్ రజాక్, సుమిత్‌కుమార్‌గౌడ్, కౌన్సిలర్లు నీరజ, పరిమళ, శోభారాణి, అబ్దుల్‌ఖని, వాలిశాంత్‌కుమార్, అరవింద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్, ఇంజినీర్ సత్యనారాయణ, ఏఈ శ్రీను, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల అధ్యక్షులు జగదీశ్వర్, హాదీ, నాయకులు జుబేర్‌లాల, బోయరాజు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు