మూసీ పరీవాహకంలో పెరిగిన వరిసాగు
మూసీ పరీవాహకంలో పెరిగిన వరిసాగు
Published Sat, Aug 13 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
భూదాన్ పోచంపల్లి
మూసీ పరీవాహక ప్రాంతమైన పోచంపల్లి మండలంలో ఈ ఖరీఫ్‌లో వరిసాగు గణనీయంగా పెరిగింది. పిలాయిపల్లి కాలువ మరమ్మతులను పూర్తి చేసి ఇటీవల సాగునీటిని విడుదల చేశారు. ఫలితంగా కాలువ ద్వారా సాగునీరు వస్తుండడంతో మూసీ పరీవాహక గ్రామాల్లోని రైతులు బీడు భూములను సాగులోకి తీసుకువస్తున్నారు. నెల పదిహేను రోజులుగా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు పూర్తవగా మరికొన్ని గ్రామాలోల వరిలో కలుపు తీస్తున్నారు.
25వేల ఎకరాల్లో...
మండలంలో వరి సాగు క్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు, మూడేళ్ల క్రితం 12 నుంచి 15వేల వరకు వరిసాగు అయ్యేది. అధికారికంగా గత ఏడాది 16వేలు ఉండగా, ఈ ఏడాది 18వేల ఎకరాల వరిసాగువుందని అధికారులు పేర్కొంటున్నారు. కాని అనధికారికంగా మాత్రం 25వేల ఎకరాల పైగా వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పిలాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు, కప్రాయిపల్లి, పెద్దరావులపల్లి, ఇంద్రియాల, శివారెడ్డిగూడెం, రేవనపల్లి, గౌస్‌కొండ, పోచంపల్లి, భీమనపల్లి, కనుముకుల, దంతూర్, వంకమామిడి, జలాల్‌పురం, జగత్‌పల్లి తదితర గ్రామాల్లో రైతులంతా వరిసాగు చేస్తున్నారు.
లె గుళ్లను తట్టుకొనే రకాలు..
స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఈ సీజన్‌లో 900 క్వింటాళ్ల విత్తనాలు, 300 వందల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ముఖ్యంగా మూసీ నీటి వల్ల వచ్చే తెగుళ్లను తట్టుకొనే 1010, ఐఆర్ 64, తెలంగాణ సోన, బీపీటీ రకాలను రైతులు సాగు చేశారు. మూసీ నీటిలో యూరియా అధికంగా ఉండడం వల్ల వరిఏపుగా పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సాగునీటి వనరులు లేని జిబ్లక్‌పల్లి, దోతిగూడెం, అంతమ్మగూడెం, హైదర్‌పూర్, బుర్రోనిబావి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో కంది, 1000 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు.
ఐదు ఎకరాలు వరి సాగు చేశా – నేదురు మల్లారెడ్డి, రైతు, జగత్‌పల్లి
గతంలో మూసీ పరీవాహకంలో క్రాప్ హాలిడే ప్రకటించడంతో 3 ఎకరాలు పడావు పెట్టాను. కాని ఈ ఖరీఫ్ సీజన్‌లో పిలాయిపల్లి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో ఐదు ఎకరాలు వరిసాగు చేశాను. పిలాయిపల్లి కాలువ గ్రామం సమీపం నుంచి వెళ్తుండడంతో గతంలో కంటే ఈసారి వరిసాగు పెరిగింది. కాలువ ద్వారా సరిపోను నీళ్లు వస్తున్నాయి.
వరిసాగు పెరిగింది – ఏజాజ్ అలీఖాన్, వ్యవసాయాధికారి, పోచంపల్లి
మండలంలో వరిసాగు క్రమంగా పెరుగుతుంది. రైతులు 70శాతం పిలాయిపల్లి కాలువ ద్వారా, 30శాతం పంపుసెట్ల ద్వారా వరిసాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 18వేల ఎకరాలు వరిసాగు చేశారని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఎరువులు పంపిణీ చేశాం. రైతు చైతన్య యాత్రల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన పెంపొందించాం.
Advertisement
Advertisement