సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
-
రెండు రోజుల్లో ఫైళ్ల విభజన పూర్తిచేయాలి
-
ఉన్న భవనాలు మరమ్మతులు చేయించుకోండి
-
ప్రస్తుతానికి రెండు జిల్లాలపైనే స్పష్టత ఉంది
-
భూపాలపల్లిలో ఐటీఐ భవనం తీసుకోండి
-
అధికాలకు కలెక్టర్ కరుణ ఆదేశం
హన్మకొండ అర్బన్ : ‘మరో నెల రోజుల్లో అంతా కొత్త జిల్లాల్లో ఉంటారు.. సమయం తక్కువగా ఉంది.. భవనాల పరిశీలన, మరమ్మతులు చేయిచుకోవడం, సామగ్రి చేరవేయడం వంటి పనులు వేగంగా చేయాలి’ అని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులతో అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గురువారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసుతం మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలపై మాత్రమే స్పష్టత ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని ఫైళ్లు పూర్తి స్థాయిలో అప్‌లోడ్ చేయాలన్నారు.
భూపాలపల్లి ఐటీఐలో కార్యాలయాలు
ప్రస్తుతం సింగరేణి భవనాలు ఇవ్వడానికి వారు సుముఖంగా లేనందున ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఐటీ ఐ భవనం కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. శాఖల వారీగా అవసరాన్ని బట్టి భవనంలో గదులు కేటయించినట్లు తెలిపారు. శుక్రవారం అధికారులు శాఖల వారీగా తమకు కేటాయించిన గదులు పరిశీలించి అవసరం మేరకు చిన్నచిన్న మార్పులు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో ఉద్యోగులకు క్యాబిన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విభజన ప్రక్రియలో ప్రతి అధికారి పూర్తి బాధ్యతగా వ్యహరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఆర్వో శోభ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.