‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచండి
Published Fri, Mar 3 2017 12:19 AM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
– డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి
కర్నూలు(అర్బన్): ఈ నెల 6వ తేదీ నాటికి జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య 1.50 లక్షలకు పెరగాలని అధికారులకు డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి సూచించారు. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. గురువారం సాయంత్రం ఆయన జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్‌తో కలిసి జిల్లాలోని ఎంపీడీఓ, ఏపీడీ, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం 1.05 లక్షల మంది కూలీలు వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నారన్నారు. కూలీల సంఖ్య పెరగకుంటే నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. జిల్లాలో 10 వేల ఫారంపాండ్స్, తొమ్మిది వేల వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు. ఉపాధి కూలీలకు పోస్టాఫీసు నుంచి కాకుండా బ్యాంకుల ద్వారా వేతనం చెల్లిస్తున్నామన్నారు. వివిధ కారణాలతో ఆయా బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాలో 1.80 కోట్లు ఉన్నాయన్నారు. ఉపాధి పనుల్లో 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన మండలాలకు చెందిన 22 మంది ఎంపీడీఓలు, తొమ్మిది మంది ఏపీడీలు, 22 మంది ఏపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు.
ఒక వారం జీతం కట్ ...
ఉపాధి హామీ పనుల్లో అలక్ష్యం వహిస్తూ.. కూలీల సంఖ్యను పెంచకుండా ఉన్న మండలాలకు సంబంధించి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, వాటర్‌షెడ్ పీఓలకు ఒక వారం జీతం నిలిపివేస్తున్నట్లు పీడీ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ పీడీలు మురళీధర్, రసూల్ పాల్గొన్నారు.
Advertisement