కళ్లలో యుద్దం
జిల్లాలో పెరుగుతున్న వాహనాల రద్దీ
కాలుష్య కోర ల్లో చిక్కుకుంటున్న పట్టణాలు
దెబ్బతింటున్న వాహనదారుల ఆరోగ్యం
నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకునే వారి కళ్లకు పొంచి ఉన్న ముప్పు
జిల్లాలో వాహనాల రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఫలితంగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నాయి. ట్రాఫిక్‌లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోవడం, విచక్షణా శక్తి దెబ్బతినడం వంటి మానసిస సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపేవారికి కూడా కళ్లల్లోతడి ఆరిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
తిరుపతి క్రైం: సున్నితమైన నేత్రాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిత్యం నేరుగావచ్చి పడే దుమ్ము కణాల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీరుకారడం .. మంట.. ఎర్రబడడం .. వంటివాటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యం రోడ్లపై ప్రయాణించే జిల్లావాసులు ఈ తరహా సమస్యలతో నేత్ర వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. జిల్లాలో సుమారు వాహనాలు 3.5 లక్షలకు పైగా ఉన్నాయి. వీటికితోడు కలియుగ వైకుంఠం తిరుమలకు రోజూ ఇతర ప్రాంతాల నుంచి 15 వేల వాహనాలు వస్తుంటాయి. వీటికితోడు జిల్లాలో అక్కడక్కడా రోడ్డు పనులు జరుగుతుం టాయి. ఫలితంగా వాతావరణ, గాలి కాలుష్యం తీవ్రమవుతోంది. వాస్తవానికి పీఎం 2.5 ధూళికణాలు ఘనపు మీటరు గాలిలో- 40 మైక్రోగ్రాములు, పీఎం-10 ధూళికణాలు- 60 మైక్రోగ్రాములు నుంచి వుంటే ప్రమాదమే. జిల్లాలో ప్రధాన పట్టణాలైన చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పుత్తూరు, సత్యవేడు, గంగాధరనెల్లూరు, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి.
సర్వేలో తేలిన అంశాలు
ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల చాలామంది కంటి పరీక్షలు చేపట్టారు. ఇందులో జిల్లాలోని మొత్తం వాహనదారుల్లో దాదాపు 12శాతం మందిలో కంటి దురద, నీరు కారడం, ఎర్రబడడం గుర్తించారు. గాలి, వాతావరణ కాలుష్యం కారణంగా ఇవి వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు, ఇతర పనులతో నిత్యం ట్రాఫిక్‌లో తిరిగేవారు నేత్ర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇవి చేయకూడదు..
కళ్లు.. దురదపుట్టిన వెంటనే అదేపనిగా నలపకూడదు, వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర కంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
కొన్ని సార్లు కంటిపై పొర కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కొందరు మెడికల్‌షాపుకు వెళ్లి ఐడ్రాప్స్ తీసుకుని వినియోగిస్తున్నారు. దీనివల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇవి చేయాలి..
ట్రాఫిక్‌లో తప్పని సరిగా సరైన కళ్లద్దాలు ధరించాలి. బెక్‌లపై తిరిగేవారు హెల్మెట్, గాగుల్స్ ధరించడం మంచిది. ఏసీగదులు, స్క్రీన్ వాచింగ్ వల్ల నేత్ర సమస్యలు పెరుగుతాయి. దుమ్మూ,ధూళి వల్ల శ్వాసకోస వ్యాధులు, ముక్కుకు సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.