Lung diseases
-
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
నిద్ర సమస్యలతో ఆ వ్యాధుల ముప్పు..
లండన్ : నిద్రలేమి, అతినిద్రతో సతమతమయ్యేవారు రోజుకు ఏడు గంటలు నిద్రించేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు పల్మనరీ ఫైబ్రోసిస్ బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు 11 గంటలకు పైగా నిద్రించేవారు, నాలుగు గంటల కన్నా తక్కువ సమయం నిద్రించేవారు ఇతరులతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారని అథ్యయనం హెచ్చరించింది. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటే ఆ అవయవం సరిగ్గా పనిచేయడం కష్టమవడం పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. మానవ శరీరంలోని అన్ని కణాలను జీవ గడియారం నియంత్రిస్తుందని, జీవ గడియారం సక్రమంగా నడవాలంటే సరైన నిద్ర అవసరమని మాంచెస్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నిద్ర లేమి, అతినిద్రతో జీవగడియారం పనితీరు అపసవ్యమై అనర్ధాలకు దారితీస్తుందని ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం పల్మనరీ ఫైబ్రోసిస్ నయం కాని వ్యాధిలా ముంచుకొస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ప్రొఫెసర్ జాన్ బ్లాక్లీ తెలిపారు. పల్మనరీ ఫైబ్రోసిస్‌కు నిద్రించే సమయానికి మధ్య సంబంధంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అథ్యయనంలో వెల్లడైన అంశాలు నిర్ధారణ అయితే నిద్ర సమస్యలను అధిగమించడం ద్వారా ఈ కిల్లర్ డిసీజ్ ప్రభావాన్ని తప్పించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. -
కబూతర్ జా..జా
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ఆరోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమించిన పావురాలపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. వీటిని అటవీ ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తుండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనిపై ‘సాక్షి’ ఇటీవల ‘రోగాల రాయబారులు’ పేరుతో కథనం ప్రచురించింది. స్పందించిన బల్దియా కేరళను వణికించిన నిఫా వైరస్ తరహాలో ఉపద్రవం ముంచుకు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని భావించి, నగరంలోని పావురాలను పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీసిబ్బంది శుక్రవారం మోజంజాహీ మార్కెట్లో 500 పావురాలను వలల ద్వారా పట్టుకొన్నారు. అటవీ శాఖ సలహా మేరకు వాటిని శ్రీశైలం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. నగరంలో ఇప్పటికే దాదాపు 6లక్షలకు పైగా పావురాలున్నట్లు అంచనా. వాస్తవానికి ఉద్యాన వనాల్లో పావురాలకు ఫీడింగ్ (ఆహార గింజలు) వేయడాన్ని బల్దియా గతంలోనే నిషేధించింది. ఇందులో భాగంగా శుక్రవారం మోజంజాహీ మార్కెట్లోనూ పావురాల ఫీడింగ్ కోసం విక్రయిస్తున్న గింజలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాదాపు 500 పావురాలను వలల ద్వారా పట్టి, శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలామని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఖైరతాబాద్ డిప్యూటీ డైరెక్టర్ విల్సన్ తెలిపారు. మిగిలిన వాటిని కూడా అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పావురాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని... ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు వెంటనే సోకుతాయని వివరించారు. పావురాలకు ఫీడింగ్ చేయొద్దని... ముఖ్యంగా మార్కెట్లు, ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల వద్ద పావురాలను ప్రోత్సహించవద్దని కోరారు. పావురాలను తరలిస్తున్న సిబ్బంది వ్యాధి కారకాలు... పావురాలు ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటికి ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మల, మూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుంచి ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోతాయి. వీటి రెట్ట చాలా ప్రమాదకరం. రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీల్లోకి చేరిపోతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతినే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆస్పత్రుల పాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలే కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధులు జలుబు, జ్వరంతో మొదలై ప్రాణాంతకంగా మారుతున్నాయి. అందుకే పావురాల రెక్కలు, రెట్టలను ముట్టుకోకూడదు. ఒకవేళ తాకినా చేతులు శుభ్రం చేసుకోకుండా ఏ పనీ చేయకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్లు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. -
కళ్లలో యుద్దం
జిల్లాలో పెరుగుతున్న వాహనాల రద్దీ కాలుష్య కోర ల్లో చిక్కుకుంటున్న పట్టణాలు దెబ్బతింటున్న వాహనదారుల ఆరోగ్యం నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకునే వారి కళ్లకు పొంచి ఉన్న ముప్పు జిల్లాలో వాహనాల రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఫలితంగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నాయి. ట్రాఫిక్‌లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోవడం, విచక్షణా శక్తి దెబ్బతినడం వంటి మానసిస సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపేవారికి కూడా కళ్లల్లోతడి ఆరిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తిరుపతి క్రైం: సున్నితమైన నేత్రాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిత్యం నేరుగావచ్చి పడే దుమ్ము కణాల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీరుకారడం .. మంట.. ఎర్రబడడం .. వంటివాటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యం రోడ్లపై ప్రయాణించే జిల్లావాసులు ఈ తరహా సమస్యలతో నేత్ర వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. జిల్లాలో సుమారు వాహనాలు 3.5 లక్షలకు పైగా ఉన్నాయి. వీటికితోడు కలియుగ వైకుంఠం తిరుమలకు రోజూ ఇతర ప్రాంతాల నుంచి 15 వేల వాహనాలు వస్తుంటాయి. వీటికితోడు జిల్లాలో అక్కడక్కడా రోడ్డు పనులు జరుగుతుం టాయి. ఫలితంగా వాతావరణ, గాలి కాలుష్యం తీవ్రమవుతోంది. వాస్తవానికి పీఎం 2.5 ధూళికణాలు ఘనపు మీటరు గాలిలో- 40 మైక్రోగ్రాములు, పీఎం-10 ధూళికణాలు- 60 మైక్రోగ్రాములు నుంచి వుంటే ప్రమాదమే. జిల్లాలో ప్రధాన పట్టణాలైన చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పుత్తూరు, సత్యవేడు, గంగాధరనెల్లూరు, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. సర్వేలో తేలిన అంశాలు ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల చాలామంది కంటి పరీక్షలు చేపట్టారు. ఇందులో జిల్లాలోని మొత్తం వాహనదారుల్లో దాదాపు 12శాతం మందిలో కంటి దురద, నీరు కారడం, ఎర్రబడడం గుర్తించారు. గాలి, వాతావరణ కాలుష్యం కారణంగా ఇవి వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు, ఇతర పనులతో నిత్యం ట్రాఫిక్‌లో తిరిగేవారు నేత్ర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవి చేయకూడదు.. కళ్లు.. దురదపుట్టిన వెంటనే అదేపనిగా నలపకూడదు, వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర కంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని సార్లు కంటిపై పొర కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కొందరు మెడికల్‌షాపుకు వెళ్లి ఐడ్రాప్స్ తీసుకుని వినియోగిస్తున్నారు. దీనివల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇవి చేయాలి.. ట్రాఫిక్‌లో తప్పని సరిగా సరైన కళ్లద్దాలు ధరించాలి. బెక్లపై తిరిగేవారు హెల్మెట్, గాగుల్స్ ధరించడం మంచిది. ఏసీగదులు, స్క్రీన్ వాచింగ్ వల్ల నేత్ర సమస్యలు పెరుగుతాయి. దుమ్మూ,ధూళి వల్ల శ్వాసకోస వ్యాధులు, ముక్కుకు సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. -
గుండాల కాలనీగుండె ఆగుతోంది
భద్రాచలం : భద్రాచలం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల కాలనీలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గత 50 రోజుల వ్యవధిలో ఈ కాలనీలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయటంతో పాటు వైద్య బృందాలతో ఇంటింటికీ సర్వే చేస్తూ, ఇందుకు గల కారణాలపై అన్వేషిస్తున్నప్పటికీ మరణాలు మాత్రం ఆగటం లేదు. వరుస మరణాలు సంభవిస్తుండటం గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా జరుగుతోందనేది అధికారులకు సైతం అంతుపట్టడం లేదు. నెల రోజులకు పైగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు గ్రామస్తులతో పాటు ఇక్కడి వైద్యులు, సిబ్బందికి కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. నెల్లిపాక పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలను అందిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావటం లేదు. ఈ నేపథ్యంలో గుండాల కాలనీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపించేందుకు సిద్ధమైంది. ఆగని మరణాలు.. గుండాల కాలనీలో 430 ఇళ్లు ఉండగా, 1470 మంది నివసిస్తున్నారు. ఇటీవల వరకూ ఆ గ్రామంలో పెద్దగా మలేరియా కేసులు కూడా నమోదు కాలేదని వైద్య శాఖాధికారుల నివేదికలు చెపుతున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలోనే జ్వర పీడుతులు నమోదవుతున్నారు. జ్వరంతో పాటు కామెర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతరత్రా జబ్బులతో భద్రాచలం,కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడ వంటి పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తూనే ఉన్నారు. గ్రామానికి చెందిన గంపల శ్రీను(32)జూన్ 21న కామెర్లతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ శ్రీను గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జులై 16న డేగల ముత్యం(48), జులై 25న పసుపులేటి ప్రియమణి(25), ఆగస్టు 9న గోసుల కిట్టయ్య (30) మృత్యువాత పడ్డారు. తాజాగా సోమవారం రాత్రి కొత్తపల్లి రాంబాబు(31) అనే వ్యక్తి మృతి చెందాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రాంబాబును మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గడంతో విజయవాడ తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. ఇలా వివిధ కారణాలతో గత 50 రోజుల నుంచి ఈ కాలనీలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. ఇందులో ప్రియమణి మరణానికి కారణం ఏంటన్నది వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. దీంతో ఇళ్లను ఖాళీ చేసే బయటకు వచ్చేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. యంత్రాంగమంతా అక్కడే... గుండాల కాలనీ మాస్ ఏరియా కూడా కాదు. ఆందోళన కలిగించే రీతిలో గతంలో ఎప్పుడూ జ్వర పీడిత కేసులు నమోదు కాలేదు. గ్రామం గుట్టకు సమీపంలో ఉండటంతో పరిసరాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఎందుకిలా మరణాలు సంభవిస్తున్నాయనేది ప్రశ్నగా మిగులుతోంది. గుండాల కాలనీలో వరుస మరణాల ఘటనను తెలంగాణ నాలుగో తరగతి మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రేగలగడ్డ ముత్తయ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన ఆదే శాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కదిలింది. ఐటీడీఏ పీవో దివ్య గ్రామాన్ని సందర్శించి రహదారులన్నీ ఉపాధి హామీ పథకం కింద శుభ్రం చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన అన్ని వీధుల్లో డ్రైనేజీ వాటర్ బయటకు పోయేలా పనులు చేయించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్ రెండుసార్లు గ్రామాన్ని సందర్శించి, ఇక్కడి వైద్యాధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. అడిషనల్ డీఎంహెచ్‌వో పుల్లయ్య, డీఎంవో డాక్టర్ రాంబాబు రెండు రోజుల కోమారు గ్రామాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. ఇక గ్రామంలో 50 రోజులుగా వైద్య శిబిరం కొనసాగుతూనే ఉంది. నెల్లిపాక పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది రోజంతా ఆ శిబిరంలో సేవలందిస్తున్నారు. కానీ పరిస్థితి అదుపులోకి రావటం లేదు. ఎందుకిలా జరుగుతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస మరణాలు గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరణాలకు కారణమేంటని ఖమ్మం నుంచి వచ్చిన సీనియర్ ఎఫిడిమాలజిస్టు డాక్టర్ మాధవరావు పరిశీలించి వెళ్లారు. గ్రామానికి ఆనుకొనే ఈము కోళ్ల ఫారమ్ ఉంది. అలాగే గ్రామం చుట్టుపక్కల బీపీఎల్ బూడిదను పోస్తున్నారు. గ్రామస్తుల ఆరోగ్యంపై ఇది కూడా ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు. అలాగే తాగునీటి సరఫరాలో కూడా ఏదైనా లోపం ఉండొచ్చనే ప్రచారం ఉంది. అధికారుల పరిశీలనలో ప్రధానంగా ఈ మూడు సమస్యలపైనే ఒక అవగాహనకు వచ్చారు. అయితే మరణాలకు అంతుచిక్కని వైరస్ కారణమై ఉంటుందని వైద్యలు అభిప్రాయపడుతున్నారు. గుండాలపై దృష్టి సారించండి : ఎమ్మెల్యే రాజయ్య గుండాల కాలనీలో వరుస మరణాలపై ప్రత్యేక దృష్టి సారించి త గిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలంబరితికి మంగళవారం ఓ లేఖ రాశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్లేట్లెట్ కౌంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, గుండాల కాలనీకి వైద్య నిపుణుల బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు.