
నిద్ర లేమి, అతినిద్రతో ఊపిరితిత్తుల వ్యాధుల ముప్పు..
లండన్ : నిద్రలేమి, అతినిద్రతో సతమతమయ్యేవారు రోజుకు ఏడు గంటలు నిద్రించేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు పల్మనరీ ఫైబ్రోసిస్ బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు 11 గంటలకు పైగా నిద్రించేవారు, నాలుగు గంటల కన్నా తక్కువ సమయం నిద్రించేవారు ఇతరులతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారని అథ్యయనం హెచ్చరించింది. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటే ఆ అవయవం సరిగ్గా పనిచేయడం కష్టమవడం పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది.
మానవ శరీరంలోని అన్ని కణాలను జీవ గడియారం నియంత్రిస్తుందని, జీవ గడియారం సక్రమంగా నడవాలంటే సరైన నిద్ర అవసరమని మాంచెస్టర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నిద్ర లేమి, అతినిద్రతో జీవగడియారం పనితీరు అపసవ్యమై అనర్ధాలకు దారితీస్తుందని ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం పల్మనరీ ఫైబ్రోసిస్ నయం కాని వ్యాధిలా ముంచుకొస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ప్రొఫెసర్ జాన్ బ్లాక్లీ తెలిపారు. పల్మనరీ ఫైబ్రోసిస్‌కు నిద్రించే సమయానికి మధ్య సంబంధంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అథ్యయనంలో వెల్లడైన అంశాలు నిర్ధారణ అయితే నిద్ర సమస్యలను అధిగమించడం ద్వారా ఈ కిల్లర్ డిసీజ్ ప్రభావాన్ని తప్పించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.