భద్రాచలం : భద్రాచలం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల కాలనీలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గత 50 రోజుల వ్యవధిలో ఈ కాలనీలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయటంతో పాటు వైద్య బృందాలతో ఇంటింటికీ సర్వే చేస్తూ, ఇందుకు గల కారణాలపై అన్వేషిస్తున్నప్పటికీ మరణాలు మాత్రం ఆగటం లేదు.
వరుస మరణాలు సంభవిస్తుండటం గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా జరుగుతోందనేది అధికారులకు సైతం అంతుపట్టడం లేదు. నెల రోజులకు పైగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు గ్రామస్తులతో పాటు ఇక్కడి వైద్యులు, సిబ్బందికి కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. నెల్లిపాక పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలను అందిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావటం లేదు. ఈ నేపథ్యంలో గుండాల కాలనీ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపించేందుకు సిద్ధమైంది.
ఆగని మరణాలు..
గుండాల కాలనీలో 430 ఇళ్లు ఉండగా, 1470 మంది నివసిస్తున్నారు. ఇటీవల వరకూ ఆ గ్రామంలో పెద్దగా మలేరియా కేసులు కూడా నమోదు కాలేదని వైద్య శాఖాధికారుల నివేదికలు చెపుతున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలోనే జ్వర పీడుతులు నమోదవుతున్నారు. జ్వరంతో పాటు కామెర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతరత్రా జబ్బులతో భద్రాచలం,కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడ వంటి పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తూనే ఉన్నారు.
గ్రామానికి చెందిన గంపల శ్రీను(32)జూన్ 21న కామెర్లతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ శ్రీను గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జులై 16న డేగల ముత్యం(48), జులై 25న పసుపులేటి ప్రియమణి(25), ఆగస్టు 9న గోసుల కిట్టయ్య (30) మృత్యువాత పడ్డారు. తాజాగా సోమవారం రాత్రి కొత్తపల్లి రాంబాబు(31) అనే వ్యక్తి మృతి చెందాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రాంబాబును మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ప్లేట్‌లెట్‌ల సంఖ్య బాగా తగ్గడంతో విజయవాడ తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. ఇలా వివిధ కారణాలతో గత 50 రోజుల నుంచి ఈ కాలనీలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. ఇందులో ప్రియమణి మరణానికి కారణం ఏంటన్నది వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. దీంతో ఇళ్లను ఖాళీ చేసే బయటకు వచ్చేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు.
యంత్రాంగమంతా అక్కడే...
గుండాల కాలనీ మాస్ ఏరియా కూడా కాదు. ఆందోళన కలిగించే రీతిలో గతంలో ఎప్పుడూ జ్వర పీడిత కేసులు నమోదు కాలేదు. గ్రామం గుట్టకు సమీపంలో ఉండటంతో పరిసరాలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఎందుకిలా మరణాలు సంభవిస్తున్నాయనేది ప్రశ్నగా మిగులుతోంది. గుండాల కాలనీలో వరుస మరణాల ఘటనను తెలంగాణ నాలుగో తరగతి మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రేగలగడ్డ ముత్తయ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన ఆదే శాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కదిలింది.
ఐటీడీఏ పీవో దివ్య గ్రామాన్ని సందర్శించి రహదారులన్నీ ఉపాధి హామీ పథకం కింద శుభ్రం చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన అన్ని వీధుల్లో డ్రైనేజీ వాటర్ బయటకు పోయేలా పనులు చేయించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్ రెండుసార్లు గ్రామాన్ని సందర్శించి, ఇక్కడి వైద్యాధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. అడిషనల్ డీఎంహెచ్‌వో పుల్లయ్య, డీఎంవో డాక్టర్ రాంబాబు రెండు రోజుల కోమారు గ్రామాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. ఇక గ్రామంలో 50 రోజులుగా వైద్య శిబిరం కొనసాగుతూనే ఉంది. నెల్లిపాక పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది రోజంతా ఆ శిబిరంలో సేవలందిస్తున్నారు. కానీ పరిస్థితి అదుపులోకి రావటం లేదు.
ఎందుకిలా జరుగుతోంది..
గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస మరణాలు గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరణాలకు కారణమేంటని ఖమ్మం నుంచి వచ్చిన సీనియర్ ఎఫిడిమాలజిస్టు డాక్టర్ మాధవరావు పరిశీలించి వెళ్లారు. గ్రామానికి ఆనుకొనే ఈము కోళ్ల ఫారమ్ ఉంది. అలాగే గ్రామం చుట్టుపక్కల బీపీఎల్ బూడిదను పోస్తున్నారు. గ్రామస్తుల ఆరోగ్యంపై ఇది కూడా ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు. అలాగే తాగునీటి సరఫరాలో కూడా ఏదైనా లోపం ఉండొచ్చనే ప్రచారం ఉంది. అధికారుల పరిశీలనలో ప్రధానంగా ఈ మూడు సమస్యలపైనే ఒక అవగాహనకు వచ్చారు. అయితే మరణాలకు అంతుచిక్కని వైరస్ కారణమై ఉంటుందని వైద్యలు అభిప్రాయపడుతున్నారు.
గుండాలపై దృష్టి సారించండి : ఎమ్మెల్యే రాజయ్య
గుండాల కాలనీలో వరుస మరణాలపై ప్రత్యేక దృష్టి సారించి త గిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలంబరితికి మంగళవారం ఓ లేఖ రాశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్లేట్‌లెట్ కౌంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, గుండాల కాలనీకి వైద్య నిపుణుల బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు.
గుండాల కాలనీగుండె ఆగుతోంది
Published Wed, Aug 13 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement