పేదల సంక్షేమమే థ్యేయం
పేదల సంక్షేమమే థ్యేయం
Published Tue, Aug 15 2017 11:21 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM
మంత్రి కిమిడి
కాకినాడ రూరల్: దేశం, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకటరావు ఉద్ఘాటించారు. మంగళవారం ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సహకరించి రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపించడానికి సహకరించాలని కిమిడి కోరారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు., 90 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురువేసి జెండా వందనం చేశారు. ఏఆర్ ఫ్లటూన్, ఎన్‌సీసీ తదితర దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిజర్వు దళాలు ప్రదర్శించిన సంప్రదాయ కవాతును తిలకించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ ద్వారా 4,828 మహిళా సంఘాలకు రూ. 124 కోట్లు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి ద్వారా 2017 మంది సభ్యులకు రూ.25 కోట్ల 22 లక్షల మొత్తాన్ని రుణాలుగా మంత్రి అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ, సబ్సిడీ కలిపి 25 యూనిట్లకు రూ.42 కోట్ల 67 లక్షలు, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ఆరు యూనిట్లకు రూ. 14 కోట్లు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ద్వారా 10 ట్రై సైకిళ్లు, ఆరు వీల్ చైర్లు, ఏడుగురికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా కోటి రూపాయలు విలువైన ఒక్కొక్కటి రూ. 10 లక్షలు విలువ గల 10 స్కార్పియో, టాటా జిస్ట్ తదితర వాహనాలను 9 మంది ఎస్సీ, ఒకటి ఎస్టీ లబ్ధిదారులకు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ చే కులాంతర వివాహాలు చేసుకున్న 84 జంటలకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున రూ. 42 లక్షలు అందజేశారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు...
విద్యాశాఖచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. వీరిలో ప్రగతి ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన స్వాగతం, స్వాగతం పాటకు, సెయింట్ అన్స్ గరల్స్ హైస్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకం, ఆదిత్యా ఇంగ్లిషు మీడియం, శ్రీనగర్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకాలకు మంత్రి కిమిడి జ్ఞాపికలను అందజేశారు.
శకటాల ప్రదర్శన...
శకటాల ప్రదర్శనలో దేవాదాయశాఖ అన్నవరం, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖ–సర్వశిక్షా అభియాన్, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ–ఎస్సీ కార్పొరేషన్, సమీకృత గిరిజనాభివృద్ధి, పర్యాటక, మత్స్య, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డీఆర్‌డీఏ, వెలుగు శాఖలు నిర్వహించే కార్యక్రమాల అంశాలతో శకటాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిచారు. పౌర సరఫరాల శకటానికి ప్రథమ స్థానం, వ్యవసాయశాఖకు ద్వితీయ, అటవీశాఖకు తృతీయ బహుమతిని మంత్రి కిమిడి, జాయింట్ కలెక్టర్ మల్లికార్జునలు అందజేశారు. మార్చ్ ఫాస్ట్‌లో ఏఆర్ ప్లటూన్ మొదటి స్థానం, ఎన్‌సీసీ బాలికల విభాగానికి రెండో, బాలుర విభాగానికి మూడో స్థానం లభించిందిం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు చోడేపల్లి హనుమంతరావును మంత్రి కిమిడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్సీ విశాల్‌గున్నిలు సన్మానించారు.
స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి...
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, డ్వామా, విద్యాశాఖ తదితర శాఖలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి కళా సందర్శించి తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసీ ఎ.మల్లికార్జున, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఆర్‌ఓ ఎం.జితేంద్ర, ఆర్డీఓ ఎల్.రఘుబాబు, స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఎన్. శ్రీనివాస్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement