భగవంతుడా మాకేంటీ కష్టం..! | Indian Air Force AN-32 plane still missing | Sakshi
Sakshi News home page

భగవంతుడా మాకేంటీ కష్టం..!

Published Thu, Jul 28 2016 9:51 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

భగవంతుడా  మాకేంటీ కష్టం..!

భగవంతుడా మాకేంటీ కష్టం..!

పరామర్శించడానికి ఎవరు ఇంటికొచ్చినా ఏదైనా శుభవార్త చెబుతారేమోనని ఆ కుటుంబాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఏ క్షణాన్నైనా తమ డాడీ తలుపు తడతారేమోనని ఆ చిన్నారుల కళ్లు ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడూ ధైర్యం చెప్పే కుమారుడి కోసం ఆ వృద్ధ తల్లిదండ్రుల హృదయం తపిస్తోంది. వారమైనా.. ఎటువంటి జాడ దొరకని ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాల దయనీయ పరిస్థితి ఇది.
 
 
గోపాలపట్నం : గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఉన్న ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ దుర్వార్త విని వారం రోజులైపోయింది. ఇంతకీ విమానం ఏమైంది.. ఎక్కడైనా క్షేమంగా ఉందా.. ఉంటే అందులో వారు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు..? ఇవీ బాధిత కుటుంబాలను దహించేస్తున్న ప్రశ్నలు. భగవంతుడా మాకేంటీ కష్టం.. అంటూ ఆ కుటుంబాలు కుమిలిపోతున్నాయి.

ఎన్‌ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్.వి.ప్రసాద్‌బాబు, పూర్ణచంద్రసేనాపతి, చరణ్‌మహరాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావులతో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు గత శుక్రవారం ఉదయం ఎయిర్‌ఫోర్స్ విమానంతో గల్లంతైన సంగతి తెలిసిందే.

ఆ రోజు నుంచి నేటి వరకూ ఆయా కుటుంబాలు అంతులేని ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ఏ క్షణాన తలుపుకొడతారేమోని ఆశగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకూ నేవీ ఉన్నతాధికారుల పరామర్శలు చేస్తే.. ఇప్పుడు ఎన్‌ఏడీ ఉన్నతాధికారులు రోజూ ఆయా కుటుంబాలను కలిసి ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. షిప్పులు, సబ్‌మెరైన్‌లు, కోస్టుగార్డులు, ఎయిర్‌ఫోర్సు, నేవీ, హెలికాఫ్టర్లు.. శాటిలైట్, రాడార్‌లతో సంద్రంలో, తీరమంతటా...ఇలా అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నా స్పష్టమైన సమాచారం రాలేదని చెబుతున్నారు.
 
ధైర్యంగా ఎలా ఉండగలం బాబూ..
ఎన్‌ఏడీ ఉన్నతాధికారులు, యూనియన్ నేతలు బుధవారం ఆయా కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వేపగుంట బీసీ కాలనీలో గంట్ల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించినపుడు ఆయన తల్లి రోదించింది. నాఒక్కగానొక్క కొడుకు గల్లంతయి వారమవుతుంది. ఎక్కడ గల్లంతయ్యాడో.. ఎక్కడున్నాడో తెలియడం లేదు.. ఇలాంటి పరిస్థితిలో మేమెలా ధైర్యంగా ఉండగలం బాబూ.. అంటూ ఆందోళన వెలిబుచ్చింది.

శ్రీనివాసరావు భార్య ఈశ్వరి మాత్రం ఇంటి నుంచి ప్రయాణానికి బయల్దేరినపుడు భర్తకు ఎదురొచ్చిన పరిస్థితినే కళ్లలో పెట్టుకుని ఎదురు చూస్తోంది. ఈశ్వరి.. అమ్మా.. బైబై.. మరో పది రోజుల్లో వచ్చేస్తా.. ధైర్యంగా ఉండండన్న శ్రీనివాసరావు మాటలనే గుర్తు చేసుకుంటున్నారు. లోపల ఆందోళన ఎంతున్నా భర్త తిరిగొస్తాడనే మాటే ఆమె నుంచి వ్యక్తమవుతోంది.

ఆమె రెండేళ్ల బిడ్డ డాడీ.. ఇదిగో.. అంటూ ఆల్బమ్ ఫొటోలను చూపుతుంటే అందరికీ కళ్లు చెమరుస్తున్నాయి. గోపాలపట్నం శ్రీనివాసనగర్‌లో ఉన్న పాటి నాగేంద్ర భార్యదీ అదే పరిస్థితి. ఆమె పిల్లలు అమ్మా.. నాన్న ఎక్కడ.. ఎపుడొస్తారంటూ ప్రశ్నిస్తుంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. భగవంతుని దయతో గల్లంతైన వారు ప్రాణాలతో రావాలని జనమంతా ప్రార్థనలు చేస్తున్నారు.
 
అప్పట్లో తండ్రి.. ఇప్పుడు కుమారుడు
 వేపగుంట బీసీ కాలనీకి చెందిన గంట్ల నూకరాజు(42) ఎన్‌ఏడీలో డ్రైవరుగా పనిచేసేవారు. ఆయనకు భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు. 2001 డిసెంబరు 26న నూకరాజు విధి నిర్వహణలో ఉండగా.. 24 గంటల కడుపునొప్పి వచ్చి హఠాన్మరణం చెందారు. ఆయన ఉద్యోగం శ్రీనివాసరావుకు వచ్చింది. దీంతో శ్రీనివాసరావు ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. రక్షణ రంగానికి సంబంధించి మంచి నైపుణ్యం సంపాదించాడు. ఆ రకంగా ఈ నెల 20న ఇంటి నుంచి పోర్టుబ్లెయర్‌కు సహచర ఏడుగురు ఉద్యోగులతో బయలుదేరిన ఆయన గల్లంతైన సమాచారం ఇంటిల్లిపాదినీ కుదిపేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement