ఇంతకీ ఏమైన్నట్లు? | When India quietly asked, Russia tried but could not locate AN-32 | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఏమైన్నట్లు?

Published Sat, Aug 6 2016 9:13 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ఇంతకీ ఏమైన్నట్లు?

ఇంతకీ ఏమైన్నట్లు?

రేపటికి అండమాన్ చేరి, ఆచూకీ కోసం గాలింపు
ఎయిర్‌ఫోర్స్ 32 విమానం ఆచూకీ తెలిసేనా?
 
గోపాలపట్నం : ఎన్‌ఏడీ ఉద్యోగులతో గల్లంతైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏఎన్ 32 విమానం కోసం దేశరక్షణ వ్యవస్థ ఎన్ని రకాలుగా శోదిస్తున్నా.. ఉపయోగం లేకపోవడంతో కేంద్రం రష్యా సహకారం తీసుకుంది. ఇప్పటికే రష్యన్ సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని రప్పించినట్లు సమాచారం. ఇది అత్యంత శక్తిసామర్థ్యం గల షిప్. 3.5 కిలోమీటర్ల లోతుకు మించి సంద్రంలో రేడియేషన్ అందుకో గల యంత్రాంగం దీనికి ఉంది. ప్రధానంగా విమానం బ్లాక్ బాక్స్ నుంచి ఎలాంటి రేడియేషన్ సిగ్నల్స్ అందకపోవడంతో ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని శోదించి తీరాలని కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోంది.
 
ఇంతకీ ఏమైన్నట్లు?
నిజానికి సంద్రంలో ఎలాంటి ఆయుధాలు పడిపోయినా గాలించగల యంత్రాంగం మన దేశ రక్షణ రంగ వ్యవస్థ వద్ద ఉంది. దేశ భద్రతకు సంబంధించి ఆయుధ ప్రయోగాలు సంద్రంలో జరిపినా.. శకలాలు ఎక్కడున్నాయో గుర్తించే నైపుణ్యం అపారంగా ఉంది. దేశభద్రతా బలగాలన్నీ సంద్రమంతా జల్లెడపట్టినా ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంతకీ ఏమైన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్నెన్నో వదంతులు
ఎంతగా శోదిస్తున్నా 16 రోజులుగా విమానం కనిపించకపోవడంతో ఎన్నో వదంతులు, ఊహాగానాలు ప్రచారంలో కొస్తున్నాయి. సంద్రంలో సబ్‌మెరైన్, షిప్‌లు, నేవీ విమానాలు, కోస్టుగార్డు విమానాలు, ఎయిర్‌ఫోర్సు విమానాలు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బ్లాక్‌బాక్స్ రేడియేషన్ అందుకోగల శక్తి సామర్థ్యాలున్న షిప్‌లు, విమానాలతోనూ శాటిలైట్, రాడార్ ప్రయోగాలు చేశారు.

ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిపుణులు సహకారాన్ని తీసుకున్నారు. అయినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఊహాజనిత వార్తలు వెలువడుతున్నాయి. ఈ అదృశ్యం వెనుక గ్రహాంతర వాసుల(ఫ్లైయింగ్ సాసర్స్) హస్తమేమైనా?  ఉందా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

మనుషుల్లాంటి మనుషులు... మనుషుల కన్నా శక్తివంతమైన గ్రహాంతరవాసులు విశ్వంలో ఓ గ్రహంలో తిరుగుతున్నట్లు, భూమ్మీదకు వచ్చి పోతున్నట్లు కూడా వార్తలు, ప్రచారాలూ వెలువడుతున్న తరుణంలో భూమ్మీదే కాక సంద్రంలోనూ విహరిస్తున్నారా? అన్న ఊహలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో వందలసార్లు గ్రహాంతరవాసులు రహస్యంగా సంచరించినట్లు కథనాలు వెలువడ్డ నేపథ్యంలో ఇక్కడా అలాంటి ఆశ్చర్యకర పరిణామాలేమైనా జరుగుతున్నాయా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
 దయనీయంగా కుటుంబాలు
 విమానంలో వెళ్లిన వారు ఏమయ్యారో.. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో... తెలియక పదహారు రోజులుగా తల్లడిల్లుతున్న ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. తిండి సహించక, నిద్రపట్టక ఒక్కొక్కరూ అనారోగ్యాల పాలవుతున్నారు. వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ఉద్యోగుల భార్యలు నీరసంతో ఆసుపత్రిల్లో చేరుతున్నారు. దేవుడా ఏంటీ మాకీ పరీక్ష... ఎందుకిలా చేస్తున్నావ్... అంటూ ఉద్యోగుల భార్యలు విలపిస్తున్న తీరు చూస్తే కళ్లు చెమరుస్తున్నాయి.  
 
 ఉద్యోగుల కుటుంబాలకు ఒక నెల వేతనం
 ఎన్‌ఏడీ యాజమాన్యం గత నెల వేతనం ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలకు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే సూపర్‌వైజర్ క్యాడరులో ఉన్న సాంబమూర్తి కుటుంబానికి వేతనం స్వయంగా అందించారు. ఈనెల 7న మిగతా కుటుంబాలకు వేతనం అందించనున్నారు. అలాగే గల్లంతైన ఉద్యోగుల కుటుంబాల కోసం ఎన్‌ఏడీలో ఉన్న 1200 మంది ఉద్యోగుల ఒక రోజు వేతనం ఇవ్వడానికి టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ యూనియన్లు తీర్మానించినట్లు ఎన్‌టీయూసీ అధ్యక్షుడు డి.ఎ.వి.ఎస్.రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement