గమ్యం చేరని ప్రయాణాలు.. | missing Airplanes around the globe | Sakshi
Sakshi News home page

గమ్యం చేరని ప్రయాణాలు..

Published Sun, Jul 24 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

గమ్యం చేరని ప్రయాణాలు..

గమ్యం చేరని ప్రయాణాలు..

చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వాయుసేన విమానం(ఏఎన్-32) శుక్రవారం గల్లంతైంది. ఈ విమానంలో వాయుసేన సిబ్బందితో పాటు విశాఖపట్నానికి చెందిన వారు 8 మంది ఉన్నారు. దీని ఆచూకీ కోసం వైమానిక దళం, నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో చాలా విమానాలు కూడా ఆచూకీ తెలియకుండా గల్లంతయ్యాయి. భువి నుంచి బయలుదేరి గమ్యం చేరకుండా మిస్టరీగా మిగిలిపోయిన అలాంటి కొన్ని లోహవిహంగాల వివరాలు..
 
 అమీలియా ఇయర్‌హార్ట్...
1937లో విమానంలో భూగోళాన్ని చుట్టేయాలని బయలుదేరిన అమెరికన్ వనిత అమీలియా ఇయర్‌హార్ట్ తన విమానంతోపాటు గల్లంతైంది.  మధ్య పసఫిక్ మహాసముద్రంలోని హౌలాండ్ ద్వీపం పరిసరాల్లో కనిపించకుండా పోయిన అమీలియా వివరాలు ఇప్పటికీ తెలియదు. అయితే ఇటీవలి కాలంలో నికుమరారో అనే నిర్మానుష్య ద్వీపం సమీపంలో అమీలియా నడిపిన లాక్‌హీడ్ ఎలెక్ట్రా విమానం తాలూకూ ఆనవాళ్లను గుర్తించారు. కచ్చితంగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో విషయం... అమీలియా 119వ జన్మదినం జూలై 24 కావడం యాదృచ్ఛికమే అవుతుంది!
 
ఫ్లయింగ్ టైగర్ లైన్   ప్లయిట్ 739
 దాదాపు 96 మంది అమెరికన్ సైనికులతో గల్లంతైన విమానం ఈ ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లయిట్ 739. 1962లో కాలిఫోర్నియా నుంచి వియత్నాంలోని సైగాన్‌కు బయలుదేరిన ఈ విమానం ఇంధనం నింపుకునేందుకు గామ్‌లో దిగింది కూడా. ఆ తరువాత 80 నిమిషాల తరువాత పిలిప్పీన్స్ చేరేలోపు కనిపించకుండా పోయింది. దాదాపు రెండులక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విసృ్తతమైన గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దీని జాడ తెలియరాలేదు.
 
బోయింగ్ 727
సుమారు 13 ఏళ్ల క్రితం అంటే 2003లో అంగోలాలోని ఫీవరీరో విమానాశ్రయంలో రన్‌వేపై ఉన్న ఓ విమానం చోరీకి గురైంది. ఎలాంటి అనుమతుల్లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఆ విమానాన్ని టేకాఫ్ చేసి తీసుకెళ్లారు. చిత్రమైన విషయమేమిటంటే.. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ విమానం ఏమైందన్నది ఎవరికీ తెలియదు. బెన్ ఛార్లెస్ పడిల్లా అనే పెలైట్ ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని అనుకుంటున్నా... అతడి ఆనవాళ్లు కూడా తెలియకపోవడం మరో మిస్టరీగా మిగిలిపోయింది.
 
స్టార్ టైగర్, స్టార్ ఏరియల్..
బెర్ముడా ట్రయాంగిల్‌లో గల్లంతైన మరో రెండు విమానాల కథ ఇది. 1948 జూన్ 30న  స్టార్ టైగర్ ఆవ్రో ట్యూడర్ విమానం సాంటామారియా - బెర్ముడా మార్గమధ్యంలో కనిపించకుండా పోయింది. అనానుకూల వాతావరణంలో చిక్కుకుని కూలిపోయి ఉండవచ్చునని అంచనాలున్నప్పటికీ  శకలాలేవీ దొరక్కపోవడం మిస్టరీగా మిగిలిపోయింది. 1949 జనవరి 17న స్టార్ ఏరియల్ బెర్ముడా - జమైకా మర్గమధ్యంలో గల్లంతైంది. చిట్టచివరి రేడియో సందేశంలో వాతావరణం బాగుందని, ప్రయానం సాఫీగా జరుగుతోందని సమాచారం ఉంది. ఆ తరువాత కొద్దిసేపటికే ఇది జాడ లేకుండా పోయింది. ఈ రెండు సంఘటనల తరువాత ఆవ్రో సంస్థ ట్యూడర్ -4 రకం విమానాల ఉత్పత్తిని నిలిపివేయడం గమనార్హం.
 
 ఫ్లయిట్ 19..
బెర్ముడా ట్రయాంగిల్‌లో 1945 డిసెంబరు 5వ తేదీన ఒకేసారి ఐదు విమానాలు గల్లంతయ్యాయి. ఇవన్నీ టీబీఎం అవెంజర్ టర్పెడో బాంబర్లు ఇప్పటివరకూ ఈ విమానాల తాలూకూ శకలాలుగానీ... అందులోని 14 మంది సిబ్బంది ఆనవాళ్లుగానీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న రేడియో సమాచారాన్నిబట్టి చూస్తే ఈ విమానాలు ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా దారితప్పి అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement