దుర్గగుడిలో నిలువు దోపిడీ | indra kiladri officers concentrate on income | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో నిలువు దోపిడీ

Published Sun, Aug 14 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

దుర్గగుడిలో నిలువు దోపిడీ

దుర్గగుడిలో నిలువు దోపిడీ

 ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్‌!
  గతంలో అన్నదానం రేట్లు పెంపు
 వ్యాపార కేంద్రంగా దుర్గమ్మ దేవాలయం 
 
సాక్షి, విజయవాడ :
కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువునా దోచుకోవడమే లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను కూడా దేవాదాయ శాఖ బేఖాతరు చేస్తోంది. అమ్మవారి డిపాజిట్లను ఇష్టానుసారంగా ఖర్చు చేసిన అధికారులు ఇప్పుడు ఆ సొమ్మును భక్తుల నుంచి రాబట్టేందుకు, దేవస్థానం తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు టికెట్ల ధరను పెంచుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్‌
అమ్మవారిని భక్తులు శ్రీఘ్రదర్శనం చేసుకోవాలంటే రూ.500 టికెట్‌ తీసుకోవాలని ఇటీవల దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో పాటు మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. తిరుపతిలో బ్రేక్‌ దర్శనం రూ.300 ఉంటే ఇక్కడ రూ.500 ఏమిటని ప్రశ్నించారు. దీంతో రూ.500 టికెట్‌ను రూ.300కు తగ్గించాలని సీఎం ఆదేశించారు. అయితే అధికారులు ఆ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఘట్‌రోడ్డులోని రాజగోపురం పక్కనే ఉండే వీఐపీ క్యూలైన్‌లోంచి వెళ్లే లైనును శ్రీఘ్రదర్శనంగా మార్చి దీని చార్జీని రూ.500గా నిర్ణయించారు. ఇక ఓం టర్నింగ్‌వద్ద క్యూలైన్‌లో వెళ్లేవారికి రూ.300 చార్జీ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ రెండు క్యూలైన్లకు పెద్దగా తేడా లేకపోయినప్పటికీ రూ.200 అదనంగా వసూలు చేయడం భక్తులు పెదవి విరుస్తున్నారు. గతంలో రూ.100 ఉంటే ఇప్పుడు రూ.500లకు పెంచడం వ్యాపారమేనని భక్తులు ఆరోపిస్తున్నారు. 
లిఫ్టు మాటేమిటి?
రూ.500 చెల్లించిన భక్తులు కూడా ఘాట్‌రోడ్డులోంచి వెళ్లాల్సిందే తప్ప లిఫ్టులో పైకి పంపబోమని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. లిఫ్టు కేవలం వృద్ధులు, వికలాంగులకేనని చెబుతున్నారు. అయితే లిఫ్టును పోలీసులు, దేవస్థానం అధికారులు మాత్రమే వినియోగించుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణ భక్తుల వద్ద రూ.500 వసూలు చేసే అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వచ్చే చోటామోటా నాయకులు, వారి కుటుంబసభ్యుల నుంచి కూడా రూ.500 చార్జీ వసూలు చేసి శ్రీఘ్రదర్శనంలో పంపించే ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే టికెట్‌ లేకుండా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని, అయితే ఒకొక్క ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు వారితో పాటు కనీసం పది నుంచి పాతికమంది వందిమాగధలు వస్తుంటారని, వారితో ఈ టికెట్లు కొనిపిస్తే బాగుటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
అన్నదానం రేట్లు పెంపు!?
గతంలో రూ.1116 చెల్లిస్తే ఒక భక్తుడు అతను కోరుకున్న రోజున అతని తరఫున 8 మందికి అన్నదానం చేసేవారు. అయితే గత ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ పూర్తిగా వ్యాపారధోరణితో ఆలోచించి ఈ రేటును అమాంతంగా రూ.5,116కు పెంచేశారు. రూ.5,116 చెల్లిస్తే, ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో 8 మందికి అన్నదానం చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు పేద, మధ్య తరగతి వర్గాలు కూడా రూ.1116 చెల్లించి అన్నదానానికి తాము కష్టామని సంతృప్తి చెందేవారు. ఇప్పుడు రేటు పెంచడంతో అన్నదానం దాతలు తగ్గిపోయారని సమాచారం. కేవలం ధనిక వర్గాలకు మాత్రమే అన్నదానానికి రుసుం చెల్లిస్తున్నారు. ఏమైనా ఐఏఎస్‌ అధికారి ఈవోగా వచ్చినా అధికారుల తీరులో మార్పు లేదని భక్తులు వాపోతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement