గంజాయి హబ్ గా ఇందూరు
♦ విశాఖపట్నం టూ మహారాష్ట్ర!
♦ వయా సూర్యాపేట, నిజామాబాద్..
♦ నల్గొండలో రూ. 10 లక్షల గంజాయి స్వాధీనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గంజాయి స్మగ్లర్లకు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. ఏళ్ల తరబడిగా సాగుతున్న ఈ దందాను అరికట్డంలో పోలీసు, అబ్కారీశాఖలు విఫలం అవుతున్నాయి. అప్పుడప్పుడు కేసులు నమోదు చేసినా.. లోతైన విచారణ లేక గంజాయి దందా షరా‘మామూలు’గా మారుతోంది. ఒడిషా, విశాఖపట్నం సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పండించే గంజాయికి మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా గాంధారి ప్రాంతం గంజాయి సాగుకు కేంద్రం కాగా.. ఇక్కడి నుంచే నేరుగా మహారాష్ట్రకు సరఫరా చేసేవారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇప్పుడు మౌనం వహించారు. విశాఖపట్నం నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిజామాబాద్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. సీఐ వై.మొగలయ్య గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ముఠా వివరాలు తెలిపారు.
ఆ వివరాలిలా..
విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం గండిగడ్ల గ్రామానికి చెందిన సింహాచలం, రవి వద్ద నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫరూఖ్ 123 ప్యాకెట్ల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా నిజామాబాద్‌కు తరలించేందుకు బొలేరో వాహనాన్ని మాట్లాడుకున్నారు. ప్యాకెట్లను వాహనంలో భద్రపరిచి సింహాచలం, రవి, ఫరూఖ్‌లు కలిసి విశాఖపట్నం నుంచి బయలుదేరారు. సూర్యాపేట పట్టణం రాజీవ్‌పార్క్ సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. దీనిని గమనించిన బొలోరో వాహనంలోని స్మగ్లర్లు.. వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్తుండడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాహనంలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విశాఖపట్నంలో గంజాయిని కొనుగోలు చేసుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్టు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు.
అయితే విశాఖపట్నం నుంచి నిజామాబాద్‌కు గంజాయిని తీసుకురావాలని ఎవరు డబ్బులు ఇచ్చారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్మగ్లింగ్‌లో రాజు, వెంకట్‌రావు, మునావర్ అనే వ్యక్తుల హస్తమూ ఉన్నట్లు తేలిందని సమాచారం. వారు ప్రస్తుతం నిజామాబాద్, విశాఖపట్నంలో ఉన్నారన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సింహాచలం, రవి, ఫరూఖ్‌లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. 123 ప్యాకెట్లలో 246 కేజీల గంజాయి ఉందని, వీటి విలువ సుమారు రూ. 10 లక్షలని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు జబ్బార్, బాసిత్, సిబ్బంది బాల్నె కుశలవ్, చామకూరి శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సైదులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.