ఫ్యాక్షన్ నిర్మూలనతోనే పారిశ్రామికాభివృద్ధి
- గవర్నర్ నరసింహన్
అనంతపురం సెంట్రల్ : ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. తొలుత జిల్లా స్థితిగతులు, నేరాలు, కారణాల గురించి ప్రొజెక్టర్ ద్వారా ఎస్పీ రాజశేఖరబాబు వివరించారు. మూడేళ్ల నుంచి నేరాలు తగ్గుముఖం పట్టాయని, జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక‌్షన్ హత్యలు గత రెండేళ్లలో ఒక్కటీ జరగలేదని తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఒక ప్రాంతం పారిశ్రామికంగా, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే భద్రత ముఖ్యమన్నారు. భద్రతకు భరోసా, ప్రశాంత వాతావరణం కల్పించేది పోలీసులేనన్నారు. టెక్నాలజీని వాడుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని సూచించారు. నేర పరిశోధనల్లో నైపుణ్యత కనబరిచి దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీసుస్టేషన్‌లకు వచ్చే ప్రజల బాధలు, సమస్యలను సావధానంగా విని.. వారికి భరోసా కల్పించాలన్నారు. పోలీసులు చట్టానికి అతీతులనే భావన పోవాలని హితవుపలికారు. యంత్రాలుగా మారిపోరాదని, కుటుంబ సంక్షేమం, పిల్లల అభివృద్ధికి తగిన సమయం కేటాయించాలని సూచించారు. జిల్లాలో పోలీసు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుండడం అభినందనీయమన్నారు. జిల్లాకేంద్రంలో పునరుద్ధరించిన కన్వెన్షన్‌హాలు, కోదండరామాలయం, నర్సరీ, కమాండ్‌కంట్రోల్ తదితర నిర్మాణాలు భేషుగ్గా ఉన్నాయన్నారు. సమావేశంలో కలెక్టర్ వీరపాండియన్, అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు ఘన వీడ్కోలు
అనంతపురం అర్బన్ : గవర్నర్ నరసింహన్ జిల్లాలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని మంగవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, అనంతపురం ఆర్డీఓ మలోల, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జ్ఞాపిక కూడా అందజేశారు.