– గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తి చేయాలి
– ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వైఎస్‌ఆర్ పుణ్యమే!
– ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేత బీవై రామయ్య
కర్నూలు (ఓల్డ్‌సిటీ): చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శించారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని గౌరు చరిత పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోవడంతో ముచ్చుమర్రి లిఫ్ట్ ప్రాజెక్టుకు వైఎస్ హామీ ఇచ్చారని, జీవో 196 జారీ చేసి, 2007లోనే రూ. 125 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. 2014, ఆగస్టు 15న సీఎం జిల్లాకు ఇచ్చిన హామీల్లో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కూడా ఉందన్నారు. రైతులకు, కర్నూలు నగర తాగునీటి సమస్యకు ఇది ఎంతో ఉపయోగకరమని, సత్వరమే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. హంద్రీ–నీవా ఫీల్డ్‌ఛానల్స్ కూడా పూర్తి చేయకపోవడం విచారకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిందేనని తెలిపారు. మూడేళ్లుగా వర్షాలు, ధరలు లేక రైతులు విలవిలలాడిపోతున్నారని, కరువు మండలాలపై నివేదికలే తప్ప ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని విమర్శించారు.
సీఎం పర్యటన ఖర్చులో 10 శాతం కూడా లేదు: బి.వై.రామయ్య
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు 15 సార్లు వచ్చారని, అందుకు రూ. 75 కోట్లు ఖర్చయిందని, ఆయన పర్యటన ఖర్చులో 10 శాతం కూడా రైతులకు ఉపయోగించలేదని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శిఽంచారు. ముచ్చుమర్రి పథకాన్ని వైఎస్ దూరదృష్టితో రూపొందించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు ఉంటే తప్ప పోత్తిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరందవని, హంద్రీనీవాకు 840 అడుగులుంటే తప్ప నీళ్లు రావని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ నిపుణులతో ఆలోచించి 790 అడుగుల మట్టానికే ముచ్చుమర్రి పథకం పనిచేసేలా రూపొందించారని తెలిపారు. రాయలసీమకు 45 టీఎంసీల నీళ్లు అందిస్తానంటూ చంద్రబాబు పట్టిసీమ కట్టించినా రైతులు ఒక్క టీఎంసీని కూడా వాడలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి పథకం ప్రారంభానికి వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి వైఎస్ పేరు పెట్టి పథకాన్ని ప్రారంభించాలని సూచించారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చక వారిని నట్టేటా ముంచారన్నారు. అనేకమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 4వ తేదీన జిల్లాకు వస్తున్నారని తెలిపారు.
ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయండి: వంగాల భరత్‌కుమార్‌రెడ్డి
చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ప్రాజెక్టులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేశాకే ముచ్చుమర్రి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. గతంలో రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి కేసీ, పోతిరెడ్డిపాడులకు ఒక్కరూపాయి వెచ్చించలేదన్నారు. కరవు మండలాలకు సంబంధించిన నివేదిక నత్తనడకన సాగుతోందన్నారు.
రెండో ఫేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలి: పీజీ నరసింహులు యాదవ్
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రెండో ఫేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఉందని పార్టీ నగర అధ్యక్షుడు పీజీ నరసింహులు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల్ని మభ్యపెట్టే సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, కార్యదర్శి సలోమి, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు సురేష్, నాయకులు ప్రహ్లాద్ ఆచారి, సాంబ, అశోక్, బసవరాజు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.