బాబు పాలనలోనే సీమకు అన్యాయం
బనగానపల్లె రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే రాయల సీమకు సాగు నీటి విషయంలో పూర్తి అన్యాయం జరిగిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో రాయలసీమ సాగునీటి సాధన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ శైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులను జీవో నంబర్ 69 ద్వారా తగ్గించింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. రాయలసీమకు సాగునీరు, తాగు నీరు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే 1996లో ఆ జీవో విడుదల చేశారని ఆరోపించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమేనన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో పథకం నిర్మాణం అగిపోయిందన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితితో పాటు ఇక్కడి రైతులు చేస్తున్న ఉద్యమాలకు కంటితుడుపు చర్యగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని బాబు ప్రారంభించారన్నారు. బాబుకు ధైర్యం ఉంటే పట్టిసీమ ద్వారా రాయలసీమకు వచ్చే 191 టీఎంసీల నీటి హక్కులపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. సీమకు ఇచ్చే నీటి విషయంలో చట్టబద్ధత కల్పించాలని మే నెలలో నంద్యాల లేదా సిద్ధేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ ఎత్తున రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఎ. రామచంద్రారెడ్డి, నంద్యాల రైతు సంఘం నాయకులు వై.ఎన్.రెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు జిల్లెల్ల శివరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు దొనపాటి యాగంటిరెడ్డి, మహానందరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.