అలకలు.. లుకలుకలు!
మింగుడుపడని మంత్రి అఖిల వైఖరి
- దూరమవుతున్న భూమా అనుచరులు
- గుర్రుగా ఆప్తమిత్రుడు ఏవీ
- 20 రోజులుగా కనీస పలకరింపులు కరువు
- నంద్యాల ఉప ఎన్నికకు ముందు సీఎంకు టెన్షన్
- నేడు జిల్లా నేతలతో హడావుడిగా సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలకు ముందు అధికారపార్టీలో చెలరేగుతున్న పరిణామాలు ఆ పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి బలంగా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కాస్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీఎం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. దీనికితోడు తాజాగా భూమా నాగిరెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి మంత్రి భూమా అఖిలప్రియ వైఖరిపై గుర్రుగా ఉండటం మరింత టెన్షన్‌ను పుట్టించింది. అంతేకాకుండా గత 20 రోజులుగా ఏవీ సుబ్బా రెడ్డికి మంత్రి అఖిలప్రియ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. భూమాకు అనుచరులుగా ఉన్న వారు కూడా ఏవీకి, భూమాకు ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకుంటూ... ప్రస్తుతం అఖిలప్రియ వ్యవహరిస్తున్న శైలిని చూసి బిత్తరపోతున్నారు. తన తండ్రికి అంత ఆప్తుడిగా ఉన్న ఏవీనే పక్కనే పెట్టే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఈ పరిణామాలు ఆ పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో శనివారం హడావుడిగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రగిలిపోతున్న ఏవీ..
వాస్తవానికి భూమా నాగిరెడ్డికి, ఏవీ సుబ్బా రెడ్డికి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఒకరు ఒక మాట చెప్పారంటే అది ఇద్దరి మాటగానే చెల్లుబాటు అయ్యేది. భూమా నాగిరెడ్డి ప్రతి కదలికలోనూ ఏవీ సుబ్బారెడ్డి ఉండేవారు. అయితే, ఆయన మరణించిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డితో భూమా కుటుంబం అంతగా సన్నిహిత సంబంధాలు నెరపడం లేదనే విమర్శలు ఉన్నాయి. భూమా అఖిలప్రియ మంత్రి పదవి అలంకరించిన తర్వాత ఏవీని మరింత దూరం పెడుతున్నట్టు సమాచారం. ఇదే నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన ఏ కార్యక్రమానికి కూడా ఏవీకి ఆమె కబురు పంపలేదు. గత 20 రోజులుగా కనీసం ఆయనకు ఫోన్ కూడా చేయలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో రగిలిపోతున్న ఆయన తన అనుచరులతో గురువారమే సమావేశమయ్యారు. మరోసారి శుక్రవారం కూడా సమావేశమై మంత్రి వైఖరిపై చర్చించారు. ఇక పార్టీకి దూరమవుదామనేదాకా వ్యవహారం వెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకుని ఏవీ సుబ్బారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. అంతేకాకుండా అఖిలప్రియకు కూడా ఫోన్ చేసి కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం.
నేడు తేలేనా?
నంద్యాలలో భూమా నాగిరెడ్డి అధికార పార్టీలో చేరినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆయన మరణం తర్వాత కూడా అవేవీ చల్లారకపోగా మరింత రాజుకున్నాయి. ప్రధానంగా సీటు ఎవరిదనే విషయంలో తగాదాలు మరింత ముదిరాయి. ఇదే నేపథ్యంలో సీటు తమకేనని.. భూమా కుటుంబానికి కాకుండా శిల్పాకు ఇస్తే ఓడిస్తామని ఫరూఖ్, ఎస్పీవై రెడ్డిలు తెగేసి చెప్పారు. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి కాస్తా పార్టీ మారారు. ఇక నంద్యాల సీటు విషయంలో తమకు ఎదురులేదనుకున్న భూమా కుటుంబానికి తాజాగా ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ కాస్తా చెమటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల సీటు విషయంపై చర్చించడంతో పాటు తగాదాలను పరిష్కరించేందుకు విజయవాడలో శనివారం జిల్లానేలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఎవరికి ఇద్దామనే అంశంపై భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు మాజీ మంత్రి ఫరూఖ్, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిల పేర్లను కూడా ఆ పార్టీ అధిష్టానం తాజాగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది భూమా కుటుంబానికి మింగుడుపడని వ్యవహారంగా మారినట్టు సమాచారం.