- ఏడు జిల్లాలకు రూ.1,680.05 కోట్లు
-ఒకట్రెండు రోజుల్లో తేలనున్న ‘అనంత’ వాటా
- వాతావరణ బీమాతో ఇన్‌పుట్‌కు లింకు
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ -2016లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు... ఈ ఏడు జిల్లాలకు సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద రూ.1,680.05 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ప్రకృతి విపత్తుల విభాగం) కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు జీవో 67 విడుదల చేశారు. ఏడు జిల్లాల పరిధిలో 12.21 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో 13.21 లక్షల మంది రైతులకు రూ.1,680.05 కోట్లు మంజూరు చేశారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన రైతుల బ్యాంకు ఖాతాలకు పరిహారం జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లాల వారీగా వాటా ఎంతనేది ప్రకటించలేదు. కాగా.. జిల్లాలో 7.17 లక్షల హెక్టార్లలో వేరుశనగతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని, 6,25,050 మంది రైతులకు రూ.1,032.69 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం మొత్తం విడుదల చేశారా, లేదా అనేది ఒకట్రెండు రోజుల్లో తెలిసే అవకాశముంది.
ఇన్‌పుట్‌కు, ఇన్సూరెన్స్‌కు లింకు
మంజూరు చేసిన ఇన్‌పుట్‌సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ విధంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారనేది అధికారులు చెప్పడం లేదు. వాతావరణ బీమా, ఫసల్‌బీమా పథకాల కింద విడుదలైన పరిహారానికి, ఇన్‌పుట్‌సబ్సిడీకి లింకు పెట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక్కో రైతుకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున గరిష్టంగా రెండు హెక్టార్లకు రూ.30 వేలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇన్‌పుట్, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టిన నేపథ్యంలో మొదట బజాజ్ అలయంజ్ కంపెనీ నుంచి వాతావరణ బీమా మొత్తాన్ని విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తే, ఆ తర్వాత ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలవుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. మండలాలు, గ్రామాల వారీగా వాతావరణ బీమా పరిహారం ఏ రైతు ఖాతాలో ఎంత జమ అయ్యిందనే వివరాలు తెలిస్తే కానీ ఇన్‌పుట్ సబ్సిడీ ఎంతివ్వాలనేది అర్థం కాదని అంటున్నారు.
మరోవైపు పంట కాలం ముగిసి 2017 ఖరీఫ్‌లో అడుగుపెట్టినా బజాజ్ అలయంజ్ సంస్థ వాతావరణ బీమా పరిహారం ఎంత, ఎంత మందికి, ఎన్ని హెక్టార్లకు వర్తించిందనేది ప్రకటించకుండా జాప్యం చేస్తోంది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాకు రూ.367 కోట్ల వాతావరణ బీమా మంజూరైనట్లు ప్రకటించారు. ఇటీవల అది రూ.434 కోట్లకు పెరిగిందని చెబుతున్నా.. అధికారికంగా విడుదలకు నోచుకోలేదు. మొత్తమ్మీద పరిహారాన్ని ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా రైతులకు ఎలా పంపిణీ చేయాలనే దానిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారుల్లో గుబులు రేగుతోంది. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో రాయలసీమ జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏలు) సమావేశమై పంపిణీ మార్గాలను అన్వేషించే అవకాశముంది. మరోవైపు ఇన్‌పుట్, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వంపై ఉద్యమించడానికి విపక్షాలు, రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు
Published Thu, Jun 1 2017 11:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement