డ్రైవర్లకు బీమా మా ఘనతే | insurance to drivers is our credit | Sakshi
Sakshi News home page

డ్రైవర్లకు బీమా మా ఘనతే

Published Mon, Aug 1 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

ఆటోడ్రైవర్ల బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల

ఆటోడ్రైవర్ల బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల

  • మంత్రి ఈటల రాజేందర్‌ 
  • ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం
  • అలంకార్‌ జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ
  • ఏనుగులగడ్డలో బహిరంగ సభ
  •  హన్మకొండ చౌరస్తా :  ఆటో డ్రైవర్లకు బ్యాంక్‌ రుణాలు అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ (తాడు) ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండ చౌరస్తాలోని ఏనుగులగడ్డ (ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రాంగణం)లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
     
    అంతకుముందు అలంకార్‌ జంక్షన్‌ నుంచి ఆటోడ్రైవర్లు పెద్ద సంఖ్యలో ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. తాడు గౌరవ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది గుడిమల్ల రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడారు. కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు తెచ్చి ఆటోలను నడుపుతున్న ఆటో డ్రైవర్లపై సమాజంలో చిన్నచూపు ఉందన్నారు. పీజీ, డిగ్రీలు చేసిన నిరుద్యోగులు డ్రైవర్లుగా మారారన్న విషయాన్ని మరవద్దని, వారిపట్ల చిన్నచూపు చూడకుండా గౌరవిద్దామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఓరుగల్లు వేదికగా ఆటోడ్రైవర్లు ఆందోళన, నిరసనలో ముందున్నారని గుర్తుచేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇప్పటికే రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.
     
    గత ప్రభుత్వాలు నిరుద్యోగులకు కేవలం లక్ష రూపాయల రుణం ఇచ్చి 30వేల రూపాయల సబ్సిడీ ఇచ్చేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ. 10 లక్షల రుణం పెంచిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని అన్నారు. కుల, మతాలకు అతీతంగా నిరుపేదలకు కల్యాణ లక్ష్మి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందేలా కృషి చేస్తామన్నారు. ఆటోల ట్యాక్స్‌ను మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆటోడ్రైవర్లు చేసిన ఉద్యమం కేసీఆర్‌ మరువలేదన్నారు. ఆటోడ్రైవర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. హోంగార్డు నుంచి పోలీస్‌ అధికారి వరకు డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయెుద్దని సూచించారు. ఉద్యమంలో కలిసివచ్చిన ఆటోడ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
     
    ఆటోడ్రైవర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని ఎమ్మెల్యే భానోతు శంకర్‌నాయక్‌ అన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్‌ ఇచ్చిన పిలుపులో డ్రైవర్లు పాల్గొన్న తీరు, వారి కష్టాలన్నీ సీఎం కేసీఆర్‌ దృష్టిలో ఉన్నాయని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సరైన సమయం కోసం చూస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఆటోడ్రైవర్లకు సరైన గుర్తింపు రావడం ఖాయమని, బాధలు తొలిగే రోజులు దగ్గరే ఉన్నాయన్నారు.
     
    ఆటోడ్రైవర్ల పరపతి సంఘం ఏర్పాటు
    ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వెయ్యి మందితో పరపతి సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ఒక డ్రైవర్‌ రూ.10 చెల్లిస్తే చాలు సొసైటీలో సభ్యుడిగా గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి నెల కొంత మొత్తాన్ని సంఘంలో జమచేసి డ్రైవర్ల అవసరాలకు తక్కువ వడ్డీలేని రుణాలను అందించేందుకే సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆటోడ్రైవర్లను ఏకతాటిపైకి తెచ్చి 2018 వరకు తెలంగాణ వ్యాప్తంగా తాడును బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
     
    ఆటోచార్జి మినిమమ్‌ 10 రూపాయలుగా సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఉత్తమ ఆటోడ్రైవర్లను వెయ్యి రూపాయల నగదు, శాలువాతో మంత్రి ఈటల సమక్షంలో ఘనంగా సన్మానించారు. టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, యాకూబ్‌రెడ్డి పాల్గొన్నారు.
    –గుడిమల్ల రవికుమార్, తాడు గౌరవ అద్యక్షుడు
     
    ప్రధాన డిమాండ్లపై తీర్మానం 
     
    1) రూ.1000 కోట్లతో తెలంగాణలోని ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలి
    2) అర్హులైన ప్రతి ఆటోడ్రైవర్‌కు డబుల్‌æబెడ్‌రూం ఇళ్ల పథకం వర్తింపజేయాలి
    3) 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్‌కు రూ. 5వేల పింఛన్‌ మంజూరు చేయాలి
    4) ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను వెంటనే కల్పించాలి
    5) ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల దోపిడీని అరికడుతూ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా వడ్డీలేని ఆటో రుణాలు ఏర్పాటు చేయాలి
    6) ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమాతో పాటు, జీవిత బీమా 3 లక్షల రూపాయలు వర్తింపజేయాలి
    7) ఆర్టీఏ, పోలీసు, ఆర్టీసీ అధికారుల దాడులను అరికడుతూ అధిక పెనాల్టీలను నిరోధించాలి
    8) ప్రైవేట్‌ ఫైనాన్స్‌ దాడులను నిరోధించి, సీజింగ్‌ వ్యవస్థను రద్దు చేయాలి
    9) ఆటోడ్రైవర్ల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి
    10) ప్రతి జిల్లా కేంద్రంలో ఆటోడ్రైవర్లకు ఆటో భవన్‌ నిర్మించాలి
    11) ప్రతి ఆటో ఇన్సూరెన్స్‌పై 50 శాతం రాయితీ కల్పించాలి
    12) విరివిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఆటో వ్యవస్థ ఒత్తిడిని తగ్గించాలి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement