Minister etela Rajendar
-
ఆణిముత్యాల్లాంటి పిల్లలనందించారు
కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించి అణిముత్యాల్లాంటి పిల్లలను తయారు చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం పీఆర్టీయూటీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ పదోతరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హజరై విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ఉపాధ్యాయులను జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల విద్యాబోధనచే విద్యార్థులు 10 జీపీఏ సాధించడం సాధ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్‌కు దీటుగా గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం వ్యవసాయం తరువాత విద్యపై ఎక్కువ నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 500లకు పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ సిద్దం వేణు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు, కార్పోరేటర్ సునీల్‌రావు, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఆదర్శన్‌రెడ్డి, సభ్యులు వెంకటరాజం, రవికుమార్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్రావు, జనరల్ సెక్రెటరీ ముస్కు తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ బాధ్యులు గణేశ్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, మహేశ్, తిరుపతి, శ్రీధర్‌రెడ్డి, కిషన్,రాధకృష్ణ, శ్రవణ్‌కుమార్, బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీని వాస్, కాళిదాస్, వేణు, చోటేమియా పాల్గొన్నారు. -
ఆదాయం, వృద్ధిలో తెలంగాణ దూకుడు-మంత్రి
సాక్షి, హైదరాబాద్: దేశ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయ వృద్ధి (జీఎస్డీపీ) రేటు 10.5 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అమలు చేసిన అభివృద్ధి పనులతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం పుంజుకుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయం (2014–15)లో 6.8 శాతమున్న జీఎస్డీపీ వృద్ధి రేటు సుస్థిరంగా పెరుగుతూ వస్తోందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డిలతో కలసి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘వస్తూత్పత్తులు, తయారీ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతికూలతను చవిచూసిన జీఎస్డీపీ ఆదాయం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. 2012–13లో మైనస్‌లో (–15.4) ఉన్న వృద్ధి రేటు 2015–16 నాటికి 9.8కు చేరింది. తలసరి ఆదాయం కూడా జాతీయ సగటుతో పోలిస్తే రూ.52 వేలకుపైగా ఎక్కువగా నమోదైంది. 2016–17లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,03,219 కాగా తెలంగాణలో రూ.1,55,612. రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం సుస్థిరంగా పెరిగింది. 2016–17లో 21.1% ఉండగా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక కూడా 17 నుంచి 18 శాతం వృద్ధి ఉంది. తెలంగాణ వృద్ధి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. పరిశ్రమలకు, సాగుకు నిరంతర విద్యుత్, నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందుండటం తదితరాలు ఆదాయ వృద్ధికి, వృద్ధి రేటుకు అండగా నిలిచాయి. 2017–18లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణదే అగ్రస్థానం’’అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో ఇదే వేగం, ఇదే ప్రగతి కొనసాగుతాయని మంత్రి ధీమా వెలిబుచ్చారు. 2018–19 బడ్జెట్ రూపకల్పనపై శాఖలవారీ కసరత్తు పూర్తయిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా సీఎం సమక్షంలో తుది మెరుగులు దిద్దుతామని చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌కు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాధాన్యంగా ఎంచుకున్న మిషన్ భగీరథ, సాగుకు 24 గంటల విద్యుత్తు తదితరాలపై భారీగా నిధులు వెచ్చించామన్నారు. కేంద్రం ఈ బడ్జెట్లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు , మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించాలని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలసి కోరాం. గిరిజన, హార్టి వర్సిటీలకు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు తగినన్ని నిధులు కేటాయించాలి’’అని కోరారు. -
రాజ్యాంగ స్ఫూర్తితోనే పెద్ద నోట్ల రద్దు
జాతీయ వినియోగదారుల దినోత్సవంలో మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: దేశ సంపద అన్నివర్గాల ప్రజలకూ అందాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సచివాలయంలో శనివారం ‘పెద్ద నోట్ల రద్దు– వినియోగదారుల సమస్యలు, పరిష్కారాలు’ అంశంపై పౌర సరఫరాల శాఖ సమావేశం నిర్వహించింది. ఇందులో ఈటల మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజామోదం పొందేలా తీసుకోవాల్సిన చర్యలను తెలంగాణ ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.20,700 కోట్ల కొత్త కరెన్సీ వచ్చిందన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో జరపుతున్నామని, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. -
రెండు నెలలకోసారి రాష్ట్రాలకు పరిహారం
జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం: ఈటల సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు వల్ల నష్టపోయే రాష్ట్రాలకు రెండు నెలలకోసారి పరిహారం చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నష్ట పరిహారం చెల్లింపు అంశాన్ని చట్ట పరిధిలోకి తెచ్చి రెండు నెలలకోసారి ఇచ్చేలా అంగీకారం కుదిరింది. ఇది ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయంలో వృద్ధి 14 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లిస్తారు. రూ.1.5 కోట్ల టర్నోవర్ కంటే తక్కువగా ఉన్న వాణిజ్య సంస్థలను రాష్ట్రాల పరిధిలో, ఆపై టర్నోవర్ ఉంటే కేంద్ర, రాష్ట్రాల పరిధిలో అజమాయిషీ ఉండాలని కోరాం. దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదు’అని పేర్కొన్నారు. జనవరి 3, 4 తేదీల్లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 5 శాతం ఉన్నందున కొత్త నోట్లలో కూడా 5 శాతం వాటా ఉండాలని, ఈ లెక్కన రూ.30 వేల కోట్ల కరెన్సీ రావాల్సి ఉందని, ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు మాత్రమే వచ్చాయని ఈటల తెలిపారు. మరో రూ.10 వేల కోట్ల కరెన్సీని, అది కూడా చిన్న నోట్ల రూపంలో ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరినట్టు తెలిపారు. -
డ్రైవర్లకు బీమా మా ఘనతే
మంత్రి ఈటల రాజేందర్ ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం అలంకార్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ ఏనుగులగడ్డలో బహిరంగ సభ హన్మకొండ చౌరస్తా : ఆటో డ్రైవర్లకు బ్యాంక్ రుణాలు అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (తాడు) ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండ చౌరస్తాలోని ఏనుగులగడ్డ (ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం)లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు అలంకార్ జంక్షన్ నుంచి ఆటోడ్రైవర్లు పెద్ద సంఖ్యలో ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. తాడు గౌరవ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు తెచ్చి ఆటోలను నడుపుతున్న ఆటో డ్రైవర్లపై సమాజంలో చిన్నచూపు ఉందన్నారు. పీజీ, డిగ్రీలు చేసిన నిరుద్యోగులు డ్రైవర్లుగా మారారన్న విషయాన్ని మరవద్దని, వారిపట్ల చిన్నచూపు చూడకుండా గౌరవిద్దామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఓరుగల్లు వేదికగా ఆటోడ్రైవర్లు ఆందోళన, నిరసనలో ముందున్నారని గుర్తుచేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగులకు కేవలం లక్ష రూపాయల రుణం ఇచ్చి 30వేల రూపాయల సబ్సిడీ ఇచ్చేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ. 10 లక్షల రుణం పెంచిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని అన్నారు. కుల, మతాలకు అతీతంగా నిరుపేదలకు కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇళ్లను అందేలా కృషి చేస్తామన్నారు. ఆటోల ట్యాక్స్‌ను మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆటోడ్రైవర్లు చేసిన ఉద్యమం కేసీఆర్ మరువలేదన్నారు. ఆటోడ్రైవర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. హోంగార్డు నుంచి పోలీస్ అధికారి వరకు డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయెుద్దని సూచించారు. ఉద్యమంలో కలిసివచ్చిన ఆటోడ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటోడ్రైవర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని ఎమ్మెల్యే భానోతు శంకర్‌నాయక్ అన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపులో డ్రైవర్లు పాల్గొన్న తీరు, వారి కష్టాలన్నీ సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సరైన సమయం కోసం చూస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఆటోడ్రైవర్లకు సరైన గుర్తింపు రావడం ఖాయమని, బాధలు తొలిగే రోజులు దగ్గరే ఉన్నాయన్నారు. ఆటోడ్రైవర్ల పరపతి సంఘం ఏర్పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వెయ్యి మందితో పరపతి సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఒక డ్రైవర్ రూ.10 చెల్లిస్తే చాలు సొసైటీలో సభ్యుడిగా గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి నెల కొంత మొత్తాన్ని సంఘంలో జమచేసి డ్రైవర్ల అవసరాలకు తక్కువ వడ్డీలేని రుణాలను అందించేందుకే సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆటోడ్రైవర్లను ఏకతాటిపైకి తెచ్చి 2018 వరకు తెలంగాణ వ్యాప్తంగా తాడును బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఆటోచార్జి మినిమమ్ 10 రూపాయలుగా సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఉత్తమ ఆటోడ్రైవర్లను వెయ్యి రూపాయల నగదు, శాలువాతో మంత్రి ఈటల సమక్షంలో ఘనంగా సన్మానించారు. టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, యాకూబ్‌రెడ్డి పాల్గొన్నారు. –గుడిమల్ల రవికుమార్, తాడు గౌరవ అద్యక్షుడు ప్రధాన డిమాండ్లపై తీర్మానం 1) రూ.1000 కోట్లతో తెలంగాణలోని ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి 2) అర్హులైన ప్రతి ఆటోడ్రైవర్‌కు డబుల్æబెడ్రూం ఇళ్ల పథకం వర్తింపజేయాలి 3) 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్‌కు రూ. 5వేల పింఛన్ మంజూరు చేయాలి 4) ఈఎస్ఐ, పీఎఫ్‌లను వెంటనే కల్పించాలి 5) ప్రైవేట్ ఫైనాన్స్‌ల దోపిడీని అరికడుతూ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా వడ్డీలేని ఆటో రుణాలు ఏర్పాటు చేయాలి 6) ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమాతో పాటు, జీవిత బీమా 3 లక్షల రూపాయలు వర్తింపజేయాలి 7) ఆర్టీఏ, పోలీసు, ఆర్టీసీ అధికారుల దాడులను అరికడుతూ అధిక పెనాల్టీలను నిరోధించాలి 8) ప్రైవేట్ ఫైనాన్స్ దాడులను నిరోధించి, సీజింగ్ వ్యవస్థను రద్దు చేయాలి 9) ఆటోడ్రైవర్ల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి 10) ప్రతి జిల్లా కేంద్రంలో ఆటోడ్రైవర్లకు ఆటో భవన్ నిర్మించాలి 11) ప్రతి ఆటో ఇన్సూరెన్స్‌పై 50 శాతం రాయితీ కల్పించాలి 12) విరివిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఆటో వ్యవస్థ ఒత్తిడిని తగ్గించాలి -
శాస్త్ర పరిజ్ఞానంతో ‘టేపుల’ పరిశీలన
మంత్రి ఈటల రాజేందర్ కాజీపేట రూరల్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి డీల్ చేసి తప్పిం చుకుంటున్నాడని, ఆ ఆడియో టేపులను శాస్త్ర పరిజ్ఞానంతో పరిశీలిస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009లో ఉప్పల్- జమ్మికుంట మధ్య జరిగిన రైలురోకో సందర్భంగా నమోదైన కేసులో మంత్రి సోమవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆడియో టేపులు బయటపడక ముందు ఒకలాగా.. బయటపడ్డాక ఒకలాగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. తెలంగాణవాదులపై పెట్టిన అక్రమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైల్వే కేసులను ఎత్తివేయాలని రైల్వే మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.