రాజ్యాంగ స్ఫూర్తితోనే పెద్ద నోట్ల రద్దు
జాతీయ వినియోగదారుల దినోత్సవంలో మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: దేశ సంపద అన్నివర్గాల ప్రజలకూ అందాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సచివాలయంలో శనివారం ‘పెద్ద నోట్ల రద్దు– వినియోగదారుల సమస్యలు, పరిష్కారాలు’ అంశంపై పౌర సరఫరాల శాఖ సమావేశం నిర్వహించింది.
ఇందులో ఈటల మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజామోదం పొందేలా తీసుకోవాల్సిన చర్యలను తెలంగాణ ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.20,700 కోట్ల కొత్త కరెన్సీ వచ్చిందన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో జరపుతున్నామని, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.