అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠా అరెస్ట్
హుజూర్‌నగర్ :
మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తమ లారీల ద్వారా సరుకులు, ఇతర సామగ్రిని చేరవేస్తామని నమ్మబలికి యజమానులను మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో నిందితులకు సంబంధించిన వివరాలను సీఐ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ కవాడీగూడకు చెందిన తుమ్మాసాయికిషోర్ ఇంటర్‌నెట్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ ట్రాన్స్‌పోర్ట్‌ల వివరాలను సేకరించి తమకు తరుచుగా మహారాష్ట్రకు వెళ్లే లారీలు ఉన్నాయని ఏదైనా సరుకుల రవాణా ఉన్నట్లయితే తమ లారీల ద్వారా చేరవేస్తామని ఫోన్లలో ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులతో మాట్లాడేవారు. ట్రాన్స్‌పోర్టుల నిర్వాహకులు అతని మాటలు నమ్మి ఏదైనా సరుకుల లోడింగ్ అడ్రస్ ఇచ్చినట్లయిదే సదరు చిరునామాకు లారీని పంపించి లోడింగ్ చేయించుకొని సరుకును గమ్యస్థానానికి చేరవేయకుండా విక్రయించి అడ్డదారులలో డబ్బు సంపాదనే ధ్యేయంగా తన అనుచరులతో కలిసి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 10న హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీసత్యనారాయణస్వామి పార్‌బాయిల్డ్ మిల్లు నుంచి 25 కేజీల బియ్యం గల 840 బస్తాలను మహారాష్ట్రలోని పూణెలో దిగుమతి చేసే విధంగా లోడింగ్ చేయించారు. అయితే ఆగస్టు 15 నాటికి కూడా సదరు బియ్యం పూణెలో దిగుమతి చేయకపోగా మిల్లు యజమానికి ఇచ్చిన సెల్‌ఫోన్ కూడా పనిచేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన మిల్లు యజమాని గజ్జి ప్రభాకర్‌రావు ఆగస్టు16న హుజూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫొటో ఆధారంగా దర్యాప్తు
తమ మిల్లులో లారీకి బియ్యం లోడింగ్ చేసిన సమయంలో సెల్‌ఫోన్‌లో లారీ డ్రైవర్ ఫొటో తీసినట్లు పోలీసులకు తెలిపారు. మిల్లు యజమాని ఆ ఫొటోను అందజేశాడు. ఫొటో ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిఘా పెట్టారు. కాగా ఈ నెల 2న పట్టణంలోని మిర్యాలగూడ– కోదాడ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టణంలో బియ్యం మోసానికి పాల్పడిన లారీ డ్రైవర్ సుశీల్‌దాస్ పట్టుబడ్డాడు. ఆ డ్రైవర్‌ను విచారించగా పట్టణంలో బియ్యం చోరీకి పాల్పడిన ముఠా సభ్యుడిగా తెలిసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మోసగాళ్ల ముఠా సభ్యులైన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, పూణెకు చెందిన రాజేష్‌వేద్, తుమ్మాసాయికిషోర్, మలక్‌పేటకు చెందిన మహ్మద్‌అబ్దుల్ సమ్మద్ లను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో బియ్యం వ్యాపారం చేసే అజయ్ అనే రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి వద్ద ఈ నలుగురు మోసగాళ్ల ముఠా సభ్యులు కొద్ది సంవత్సరాల క్రితం పని చేశారు. కాలక్రమేణా అజయ్‌తో విభేదాలు రావడంతో ముఠా సభ్యులు ఒక లారీని కొనుగోలు చేసి అడ్డదారులలో మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించడాన్ని మార్గంగా గత కొంతకాలంగా ఎంచుకున్నారు.
మోసాలు ఇవే..
అయితే ఈ ఏడాది జూలైలో కాకినాడలో లోహిత్ ఇడిబుల్ ఆయిల్ ఏజెన్సీ ద్వారా రూ. 7లక్షల 85వేల విలువైన వనస్పతి గోల్డ్ వంటనూనెలను మహారాష్ట్రకు రవాణా చేసేందుకు లోడింగ్ చేయించుకొని ఏజెన్సీ వాళ్లను మోసం చేసి వంట నూనెలను రూ. 6 లక్షలకు విక్రయించారు. ఆగస్టు15న కోదాడలోని వేదాద్రి పేపర్ మిల్స్‌లో రూ. 4లక్షల 35వేల విలువైన పేపర్ లోడింగ్ చేయించుకొని నిర్దేశిత అడ్రస్‌లో దింపకుండా వారి ఆ«ధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని చర్లపల్లి వద్ద గోడౌన్‌లో దించారు. ఆగస్టు 25న కర్నూలులో రూ. 5లక్షల 26 వేల విలువైన కాస్టిక్ సోడా బ్యాగులను లారీకి లోడింగ్ చేయించుకొని హైదరాబాద్‌లోని చర్లపల్లి గోదాంలోనే దించుకున్నారు. హుజూర్‌నగర్‌లో లోడింగ్ చేయించుకున్న బియ్యాన్ని రూ. 6లక్షల 30 వేలకు, కాకినాడలో లోడింగ్ చేసిన వంటనూనెలను రూ. 6 లక్షలకు విక్రయించగా, రూ. 12లక్షల 30 వేల నగదు వారి చేతికి వచ్చింది. అందులో కొంత నగదును ఖర్చు చేయగా పోలీసులు వారి వద్దనుంచి రూ. 10లక్షల 50 వేల సొత్తును రికవరీ చేశారు. మహారాష్ట్ర అడ్రస్‌తో లారీకి తరుచుగా మార్పిడి చేసే పలు నంబర్ పేట్ల బోర్డులను, లారీని స్వాధీనం చేసుకొని హైదరాబాద్‌లో గోదాంలోని పేపర్, సోడాను సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకైనపాత్ర పోషించిన గరిడేపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఐడీపార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది పెరుమాళ్ల శ్రీనివాస్, బలరాంరెడ్డి, శ్రీనివాసాచారి, ప్రకాశ్ తదితరులున్నారు.