అంతరాష్ట్ర దొంగ అరెస్టు | inter state thief arrest | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

Published Thu, Sep 7 2017 9:26 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

అంతరాష్ట్ర దొంగ అరెస్టు - Sakshi

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

గుత్తి: అనంతపురం, కర్నూల్‌ , కడప జిల్లాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న  అగ్రహారం రంగస్వామి అనే అంతరాష్ట్ర దొంగను ఎట్టకేలకు గుత్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ ప్రభాకర్‌ గౌడ్‌ విలేఖరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కర్నూల్‌ జిల్లా తుగ్గలి మండలం  రాంపల్లి గ్రామానికి చెందిన అగ్రహారం రంగస్వామి అనే 23 సంవత్సరాల యువకుడు గత రెండు, మూడు సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు.  అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లలోకి ప్రవేశించి  దొంగతనాలకు పాల్పడుతుండేవాడు.

గుత్తి మున్సిపాలిటీతో పాటు బాచుపల్లి, ధర్మాపురం గ్రామాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. మూడు జిల్లాల పోలీసులు ఆ దొంగను పట్టుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో  సదరు దొంగ గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో ఉన్నట్లు సీఐకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన వెంటనే సిబ్బందిని వెంట బెట్టుకుని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన దొంగ పరుగు తీశాడు. ఎస్‌ఐ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రవి, మోహన్, ఆదిలు సుమారు కిలో మీటరు వెంట పడి దొంగను పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి అతని వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగను కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. దొంగను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు చూపిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను సీఐ అభినందించి నగదు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement