ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
– చోరీకి గురైన ట్రాక్టర్ స్వాధీనం
– దొంగల్ని పట్టించిన సీసీ కెమరాలు
హిందూపురం రూరల్ : రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టర్‌ని అందరి కళ్లుకప్పి అంతర్రాష్ట్ర దొంగలు అపహరించినట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాలనాయుడు, ఎస్‌ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్‌లో వారు మీడియాకు ఇలా తెలిపారు. మండలంలోని దేవరపల్లి గ్రామానికి చెందిన రామచంద్రప్ప కుటుంబ పోషణ కోసం ఫైనాన్స్‌లో రూ.6లక్షలా80 వేలు రుణం తీసుకుని ట్రాక్టర్‌తో జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం సంతేబిదనూరు గేటు వద్ద రోడ్డుపక్కనే ట్రాక్టర్ నిలిపి ఉంచి రామచంద్రప్ప భోజనానికి వెళ్లాడు.
తిరిగి వచ్చి చూసే సరికి ట్రాక్టర్ కన్పించలేదు. చుట్టుపక్కల గ్రామాలు, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ట్రాక్టర్ ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇటీవలే ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లోని పుటేజీల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరిలో ఆరా తీయగా దొంగలు బోయరాజు (26), బోయ గోపీ (32) అని, రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా ట్రాక్టర్‌ను చూపించినట్లు సీఐ తెలిపారు. ట్రాక్టర్‌ని స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్‌కి తరలించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ నారాయణ, హెడ్‌కానిస్టేబుల్ అక్బర్ కానిస్టేబుల్ రవీ, వసంత్ తదితరులు ఉన్నారు.